Monday, December 26, 2011

సూర్యసుమం

తూరుపుచెంపలపై తన తొలిచుంబనం
పుట్టిన పులకరింత పేరే ఉదయమట!

పడమటి కౌగిట తనివితీరిన తన తాపం
అలసిన గగనవేదిక పేరే సాయంత్రమట!

వెలుతురుపువ్వుల నవ్వులు కురుస్తూ
దివిదీవుల దివ్యాశ్వాల చరిస్తూ
భువిదారుల కిరణతేజాలు పరుస్తూ
దిక్కులతో చిరంతనంగా రమిస్తూ......
                                                      -------------వంశీ

Sunday, December 18, 2011

నింగినిదుర

మెత్తగా మబ్బుకుచ్చుల ఉయ్యాల  
మత్తుగా రాతిరమ్మ గాలిజోల   
చనువుగా చందమామ
ను కావలించుకుని
అనువుగా చుక్కలదుప్పటి కప్పుకుని
ఉరుకున పగలు కాచి, అలసి ఆదమరచి
పడమరకు ఒత్తిగిలి, పడుకుంది ఆకాశం
తూర్పు పొద్దొచ్చి ముద్దిచ్చినా లేవనంటూ
తుళ్ళి తుళ్ళి రవికాంతులు గిల్లినా లేవనంటూ
                                                                    ---------వంశీ

Friday, December 16, 2011

బంగారుదివిటీ

ఏళ్ళు గడుస్తున్నా, ప్రాణశిలనై నడుస్తున్నా
పొందలేని వాటికై పరుగులు పెట్టలేక
పొందగలిగిన వాటిపై చిన్నచూపు పట్టలేక

పొందిన వాటిని పొందిగ్గా దాచుకోలేక
ఏకాంతహిమాన ఘనీభవించేదాకా
ఏళ్ళు గడుస్తున్నా, అలాగే నడుస్తున్నా
పాతకం పాతాళానికి నెట్టేస్తున్నా
వెక్కిరించే చూపులసుడిగాలి చుట్టేస్తున్నా
స్పష్టాస్పష్ట బంధాలు బంధనాలై బంధిస్తున్నా
ఊహలనార ఉరితాళ్ళు పేనుతున్నా 
ముసిరే కన్నీటిముంపు ముంచేస్తున్నా
ఏళ్ళు గడుస్తున్నా, కరగని మబ్బునై నడుస్తున్నా
నాకు నేను కనిపించే, అంతరంగాన్ని వెలిగించే
ఎదో అంతుచిక్కని బంగారుదివిటీ కోసం
బ్రతుక్కి నన్ను తాకట్టు పెట్టుకున్నా
స్వేచ్ఛగా కదల్లేక, వదల్లేక, విడిపించుకునే వీల్లేక
ఒకే పథాన, ఒకే విధాన
నన్ను వెతుక్కుంటూ
ఏళ్ళు గడుస్తున్నా, ఇంకా అలాగే నడుస్తున్నా!
                                                                       ----------వంశీ


Friday, December 9, 2011

ఉదయహృదయం

రాతిరంతా కురిసిన మంచుమాటున దాగి దాగి
శరత్కాలపు లేతఎండలో రెక్కలారిన గువ్వకూనా,
నీ గుండెనూరి గొంతుదారి
పాట ఒకటి పరుగులెత్త
స్పందన పొందిన ఉదయహృదయం,
శ్వాసకిపుడు సరిగమల స్నానం!

ఏరికోరి చెంతచేరి
గాలిగంతులు వంతపాడ
మాటై చిగురించదా ప్రతిమౌనం,
కువకువల రాగాన పుట్టదా మరో ప్రపంచం !!
                                                                 -----------వంశీ



Sunday, November 13, 2011

ఇంకెవరు నాకు ఇనకులతిలకా

ఇంకెవరు నాకు ఇనకులతిలకా
ఇసుమంత నీకీ దీనుపై దయరాక   

1: కాల్చివేయు జన్మతాపమున
కలి మాయలు తాళ తరమేనా 
కరుణ కలుగు తరుణము కాదనా   
మరణపు శరణము తప్పించ  ||ఇంకెవరు నాకు ఇనకులతిలకా||

2: బ్రతుకును నీకే కైంకర్యము చేతు    
చితికిన మతికి గతి నీవని తలతు 
సాంత్వనగూర్చు నీ నామకీర్తనజేతు
రాతితనమున చేతన కలిగించ  ||ఇంకెవరు నాకు ఇనకులతిలకా||
                                                                                                       ---------వంశీ

Tuesday, October 18, 2011

గుండెగుబులు

నీ మనసుపూల భావగంధం మరిగి 
నా తుమ్మెద ఎదకు గుబులైనపుడు,   
వేదనలో వేచిన కాలాలు కరిగి
జన్మంత దూరం దగ్గరైనపుడు,  
ఒంటరితనపు చీకటినిశి తరిగి    
ప్రేమోషస్సు ముంగిట వెలిగినపుడు,           
ఇంకా లేనిపోని దాగుడుమూతలాడి...      
నువ్వే నిండిన గుండెను నిప్పులకొండ చేయకు     

చల్లార్చను కంటివాన సరిపోదు!
నీ మీదే ప్రాణం పెట్టుకున్న ప్రాణాన్ని మెలిపెట్టకు
చిక్కబట్టను ఓపిక ఇకలేదు! 
                                            ------------వంశీ

Monday, October 3, 2011

పరమీవె పరమపురుషా

పరమీవె పరమేశ పరమపురుషా  
వరచరణాలకిదె ఆత్మ నీరాజనం      

నెలవంక సిగమల్లికగా  
జలగంగ జడలనొదగగ
నాగులు నగలుగ నాట్యము సలుపగ
గళమున గరళపు గరిమవు నీవెగ
గైకొన
వయ ఘన నీరాజనం!    |పరమీవె పరమేశ| 

ప్రమదగణాలనువర్తనసేయ 
అలతిలయల పదనర్తనరాయ
ఓంకారబింబ త్రిలోకవందనీయ 
రుద్రస్థలనిలయ గిరిజామనోదయా   
ఉగ్రతాండవ అగ్రదేవయ  
అగ్నిలోచన అందుకోవయ
పంచప్రాణాల నీరాజనం!    |పరమీవె పరమేశ|

                                                                                                                                       -------------  వంశీ

Friday, September 23, 2011

సరినెంచ సమయమురా రామా

సరినెంచ సమయమురా సారసనయన 
అగణితసుగుణ సాకేతరమణా రామా!  |సరినెంచ సమయమురా |

అంతట నువురా ఆద్యంతము నువురా  
అంతరంగమంతా ఆవరించినావురా        
చింతలుమాపి చిత్తశాంతముసేయరా
సంతససారంగమై గంతులాడజేయరా రామా! |సరినెంచ సమయమురా |

కరుణాశరములు సంధించరా
దరిజేర దారి చూపించరా
కరములు మోడిచి మనసార 
మరి మరి నిన్నే కొలుతునురా రామా!  |సరినెంచ సమయమురా |
                                                                                         ----------- వంశీ

Wednesday, September 7, 2011

కన్నెవాన

పల్లవి:
                                             

వానా నువ్వెంత జాణవే,
గలగల పరుగుల
జిలిబిలి కులుకుల 
జలజల మోతల జలవీణవే!  |వానా|

అనుపల్లవి:

భూమిగుండెలో కరిగి
మండుటెండలో మరిగి
మింటిదారుల పెరిగే
మబ్బుకొమ్మల రాలుపూతవే |వానా|

చరణం:

మెరుపుచీర చుట్టుకుని
ఉరుముగజ్జె కట్టుకుని
మొయిలుగట్లు దాటుకుని
నీటిపూలు చల్లేవటే
పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే  |వానా|

అనుచరణం:

గగనపు నీళ్ళ జల్లెడ వెంట
వెండి నీరెండ నిండ
విల్లై విరిసిన ఏడురంగుల పంట
నీ మాయ కాదటే  |వానా|

చరణం:

మా ఇంటిచూరు నీటితీగవే
ఏటిపాయల తేట నురగవే
కొండవాగు కొత్తనడకవే
బండరాళ్ళకూ ఎండుటాకుకూ
కొత్తపూలకూ లేతచిగురుకూ
ముద్దులిచ్చి పొయేవటే        |వానా|

అనుచరణం:

ఆకుచెంపపై మెరిసి
సోకు వనమంతా తడిపి
వయసంతా వరదై వాగల్లే ఉరికేవటే
నింగినుంచి నేలకు దూరాలు కొలిచేవటే  |వానా|
                                                                  ---------- వంశీ

Sunday, September 4, 2011

స్వప్నశిల

ఒక కలవరం, వెనువెంట ఒక పరవశం
పదే పదే.......  
ఎందుకో తెలీదు....మునుపెన్నడూ లేదు!     
నింగిని నిలువున చీల్చే మెరుపులా  
కలలశిలలు ఒక రూపుదాల్చిన నిజంలా     
మబ్బుకొమ్మల చెట్టురాల్చిన చినుకుపువ్వులా
వేల వీణలు వేణువులు
కలగలిసి కురిసిన గమకపు వానలా
                                                            ------------ వంశీ 

Wednesday, August 24, 2011

వంశీనాదమదె మోగెరా

వంశీనాదమదె మోగెరా చెవులారా
వంశీరవుడు రవళించి కనిపించ, వంశీనాదమదె మోగెరా
చెవులార! 

పొన్నపూదండలల్లి వేచిన రాధిక ఎద పొంగ
తెలినురగల యమున తుళ్ళింతల తూలిపోగ
నీరదమండలమంతా వానధారై పొంగగ  
మన్నుతిని లీలజూపు యదుజన మానసవిహంగ   వంశీనాదమదె మోగెరా చెవులార!

గాలినటన ఒకసారి నాసికభూషినిగా
మురళిగొంతున పూసిన పున్నాగవరాళిగా 
గొల్లభామలను కవ్వించు కవ్వాళిగా  
వెలలేని వేవేల సరాగాల సరులుగా    వంశీనాదమదె మోగెరా చెవులార!

రసమయమై రాసక్రీడలు రాటుదేలగ
రాధ పెదవి చదివే మధురాష్టకం సాక్షిగ
అల్లన పిల్లనగ్రోవికి పులకలు పుట్టగా       
నందన వనమందున నందనందనుని  వంశీనాదమదె మోగెరా చెవులార!  
                                                                                              
--------------వంశీ

Tuesday, August 9, 2011

ఒంటరిప్రేమ

ఒంటరితనమా నాపై నీకెందుకింత ప్రేమ?
వెన్నంటి వుంటావు వెన్నంటి మది నీది   
గోదారి ఎదలో కన్నీటి కథలా
నాదారిలో నడిచొస్తూ ఉంటావు
ఒంటరితనమా నాపై నీకెందుకింత ప్రేమ?

తెల్లారినపుడు ఎర్రని కనుదోయివా
కాటేసిన కలల గురుతుగా!
మసకేసినపుడు చల్లనితెమ్మెరవా 
మరపులేని గుర్తుల లాలి పాటగా!  
తెగని బంధం నువ్వా, ప్రేమగంధం నువ్వా
ఆశవు నువ్వా, అడియాసవూ నువ్వా, ఓ తుంటరి
ఒంటరితనమా నాపై నీకెందుకింత ప్రేమ

                                                               -----------వంశీ

Saturday, July 16, 2011

రామయ్య ఏమయ్య నను గానవూ!

పల్లవి: రామయ్య ఏమయ్య నను గానవూ ||2||
భువితనయ హృదయాలయ, అపరిమిత ప్రేమాలయ, రామయ్య ఏమయ్య నను గానవూ!  


చరణం 1: అమితలావణ్యముల వనిత సీత నీ చెంత 
సందిట సౌమిత్రి మారుతి పరివారమంతా
మహిలో మనుజులు దివిజనులంతా 
అన్నిజీవులు నిను మోహించి మొక్క
తన్మయతెరల నను మరచినావా సాకేత రామయ్య ఏమయ్య నను గానవూ! 


చరణం 2: కలికల్లోలముల బహుకలల వలల
ఎన్ని మోహముల ముంచేవిలా   
మతిహీనుడనైతి మాయలు చాలవా 
నిర్మలచిత్తమీయ జాగింత తగవా    
కోరి కోరి కోటిదండములివె 
నిను కొలిచి కొనియాడ మనసాయె కోదండ రామయ్య ఏమయ్య నను గానవూ!   


చరణం 3: సరసీరుహాక్ష దయార్ద్రదక్షా  
వరసుధావర్ష నీ పదపంకజముల చేరలేని గడ్డిపువ్వునయ్య   
గోపయ్య త్యాగయ్య అన్నమయ నీ భావగానముసేయ 
ఘనుడవై ఘనభక్తుల బ్రోచినావటగద 
ఈ బడుగు బతుకునలుపు మాపర భార్గవ రామయ్య ఏమయ్య నను గానవూ!   
                                                                                        --------- వంశీ   

Tuesday, July 12, 2011

నీదే నా మనోవిశ్వ సంచారం

పల్లవి: తగు రాగరీతులు తెలియవు నాకు, నోరార నిను నుతింప
తగు తాళగతులు తెలియవు నాకు , ప్రియమార నిను పూజింప

చరణం 1: సామగానమట నేనెరుగను

స్వరప్రస్తారమట నేనెరుగను
తమకపు గమకధారల నిను తడపనెరుగను
సదా నిన్నెద నిలిపి కొలుచుట తప్ప

చరణం 2: జతులెన్నొ లయలెన్నొ నేనెరుగను
సరిగాత్ర శ్రుతులెన్నొ నేనెరుగను
మందస్మితానంద మువ్వంపు ముకుందా!
నువ్వే నా మనోధర్మ సంగీతం
నిఖిలాంతరంగ నీలంపు నీరజాక్షా!
నీదే నా మనోవిశ్వ సంచారం 
                                                                         ---------------వంశీ

Sunday, July 3, 2011

పిలుపే ఓ లాలిపాట

పిలుపే ఓ లాలిపాట
తలపే ఓ పూలతోట  
కలిపే ఆ కళ్ళలో ఖైదునై నేనుంటా
జన్మంతా...ఈ జన్మంతా   
దయరాదా కాసింత   || పిలుపే ||  

ముసినవ్వు విసిరి వెలిగిస్తావు ముఖదీపం
కొసచూపు ముసిరి కొరికేస్తావు నా ప్రాణం
పెదిమలనదిమిన సిగ్గువర్ణం, అది లేత సంధ్యారుణం!
ఎద నిండా నవనీతం, నాకందితే హిమతల్పం
వెతికి వెతికి వేసారలేను, వరమై వరించుమా || పిలుపే ||  

Thursday, June 30, 2011

'M singin' my heart out!

Can't be a lone star losin' all the luster
Can't be a mournin' cloud in the moonless skies
Can't be a witherin' dream in the moist eyes
'M walkin' away from me.....'M so distant from me!
Come and get me out, 'M singin' my heart out!
From the dark abyss...into the sparkling bliss
From the dusky maze...into the morning glaze
From the searing pain...into the dancing rain
Come and get me out, 'M singin' my heart out
Being so meek, it's just you what I seek
Make it easy for me to breathe
Make it easy for me to smile
Been longin' for you...Been lookin' for you
Be my sonnet...Come and get me out, 'M singin' my heart out!
and I would never let go, I would never let go 
                                                                                                                   
                                                                               -------- Vamsi Krishna

Saturday, June 11, 2011

నవ్వులపేరు

తన గలగలల తెలుపు నవ్వులు...నాకు
చీకటి పొలమున మొలిచిన చుక్కల మొక్కలేమో
అమవస దాటి వెలిగిన నెలవంక ముక్కలేమో
చంద్రుడు పరిచిన పండువెన్నెల పక్కలేమో
సూర్యుడు మెరిసిన తూరుపుకొండ దిక్కులేమో  
                                                                        --------------- వంశీ  

Thursday, June 9, 2011

కుతి తీరదు

పల్లవి: కుతి తీరదుగద నీ కుందనముల మోముగన
ఇన్ని చతురముల ధరనేలు సిరిపతి మాకు |కుతి|   

చరణములచోటె మేటి వరమురా వనమాలి
తరుణములన్నిట తలపు వేలుపై వెలగ 
మరణజనన వలయాల వదిలేవు మమ్ముల
పరమును కల్పించ నీ తరమే కదరా మాకు |కుతి|
 
కాలు ఇనపచువ్వల వలె ఎద దిగబడె
పలు పాశముల సడలింప సమయమేదిరా
వాలు పొద్దుల వలె బతుకుసంధ్యలు కదలగ
మేలు జరిపించ నీవె మేరునగధరుడా మాకు |కుతి|

Thursday, June 2, 2011

ఇలమండల నాయకా

పల్లవి: ఇలమండల నాయకా ఇవె చూడు మొక్కులు
మక్కువతోడను మా అయ్య నీకు
అలకొండల పాలకా వేవేలు దండములు 
అక్కునజేరను మా అయ్య నీకు |ఇలమండల|

చరణం 1: దశరూపధరుడా దిశలెల్లా నీవెగా
కలిమిభాగ్యాలు కలిగింప దిక్కు మా అయ్యవు
నిశిరంగులధీరుడా మా నిధులన్ని నీవెగా
బతుకుయఙ్ఞాలు ఫలియింప గతి మా అయ్యవు
|ఇలమండల|
చరణం 2: వేపేరుల వీరుడా వెతలుమాప నీవెగా
మనసునిండ వెన్నపూస మంచి మా అయ్యవు
మా పాలిటి ఆప్తుడా సర్వాత్మలందు నీవెగా
అన్ని కర్మములు సరినెంచగను మా అయ్యవు
|ఇలమండల|
                                                                             ---------------- వంశీ

Sunday, May 22, 2011

వేడుకోలు

తెగని ఆశల తెగులేల ఎదకింక
ఏలికవై కాలమెల్ల కావగ కుదురై నన్నిక |తెగని|  

పుడమెల్ల  పాలించు పావనుడా
ఈ పుట్టుక పండించు దారేది నువు గాక |తెగని|
రవ్వంత మతిలేదురా ఇసుమంత దయరాక  
సుగతుల ఒరవడి చూపను వేడేది నిను గాక |తెగని| 
నమ్మిక గన్న మేటి గరిమల దొరవిక 
తెలియని త్రోవల తోసేది ఎవరిక నువు గాక |తెగని|    
తరగని శోభలతూగు తిరుపురవాసుడా
దురాత్మను కడగను విధమేది నువు గాక  |తెగని| 
కొండలకోనేటి కోవెల నెలవా నీకిక 
అయిదు ప్రాణాలు ప్రణమిల్ల ఆదరువు నువు గాక |తెగని|  
                                                                                        --------------- వంశీ

Friday, May 13, 2011

తాళజాల - మరో కీర్తనా ప్రయత్నం

పల్లవి: తాళజాలను భవతాపమింకను
తావియ్యవయ్యా వెన్నుడా నీ దరిని |తాళజాల|

చరణం 1: కోర్కెల కత్తులు కోయగబట్టెను
మైలదేహమిది మాయల భ్రమసేను
మాయని దురితకూటమిని కుమిలేను 
దీపించవయ్యా దన్నుగ వెన్నుడా నీకిదె విన్నపము! |తాళజాల| 

చరణం 2: సంకటకొలిమిని కాలగ బట్టెను
పాపపు సంకెల చెరనే బట్టెను
భారపు బతుకును త్రుంచగలేను
సరినెన్నవయ్యా నన్ను వెన్నుడా నీకిదె విన్నపము! |తాళజాల| 
                                                                                           --------------- వంశీ

ప్రస్తుతి

నుదురూ నామాల వాడు, వెదురూ నాదాల వాడు
తలచు వారి ఎదలందు ఎల్లపుడు మెదలేటి వాడు!
తిరునగమూ మీది వాడు, మర్రాకూ తెప్పల వాడు
సింగారి సిరులదేవి శ్రీలు కురిసే లోకాల రేడు!
కొలనుదరి కొంటెగాడు, మన్నుతిన్న మాయగాడు
కొనగోటా కొండను ఎత్తే బంగారుకొండ వీడు!
పాముపడగ నీడలతోడు, పాల అలల నిదురించు వాడు
అడుగులతో అవనిని కొలిచే పూవరపు చూపుల వాడు!
నీలిమబ్బు రంగుల వాడు, నెమలికన్ను పింఛము వాడు
కాళింది మడుగున ఆడే వామనపు అడుగులవాడు!!
                                                                                     ----------------వంశీ 
 

Thursday, April 28, 2011

ఆర్తి

మాట వినిపించకుంటే, రూపు కనిపించకుంటే    
కళ్ళెందుకో కారుమబ్బులై కరుగుతున్నాయ్!
ప్రాణనాడులు స్పందించనంటున్నాయ్! 
గుండెబావుల నీళ్ళింకిపోతున్నాయ్,
తడిజాడ లేని ఎండమావులవుతున్నాయ్!  
ఒక్క క్షణం ఎడబాటైనా చాలు
ఎగశ్వాసతో ఎద అల్లాడిపోతుంది!
చినుకు తాకని నేలలా ఉనికి లేక నిస్తేజమవుతున్నా!
చేరువగా నీ అడుగుల అలికిడి అయ్యేదెప్పుడో!
ఈ వేడిఋతువు ఆవిరి ఆగేదెప్పుడో! 
విడివడని చూపులసంకెల పడేదెప్పుడో! 

నవ్వుల్లో చుక్కలు పొడిచేదెప్పుడో!
                                                                         --------------వంశీ


Thursday, April 21, 2011

మనసుపూలు

ఒంటరి పువ్వుపై తుంటరి తుమ్మెద వాలినట్టు...
జంటకనులపై ఎగిరే కలల ఝంకారాలు!
నాలో నన్ను నేను కొత్తగా వెతుక్కునేట్టు
నువ్ రాగానే నిలువెల్లా వేల వేకువల కాంతిపుంజాలు!
మాటలు చాలని మమతలు పోగేసుకుంటూ...
వలపై వచ్చి వయసుతోటలో మనసుపూలు కోసుకెళ్ళు!
అవి నీకే...నువ్ నాకే...!!
                                                                    -------------- వంశీ

Tuesday, April 12, 2011

ఒంటరి ఘడియలు

పులుముకున్న శ్రీగంధం కొంచెం గాలిలో కలిపావా,
ఊపిరి తీగలపై ఎడతెగని హాయిసన్నాయి!
తురుముకున్న పూలు విదిల్చి పుప్పొడి ఇటు చల్లావా,
తనువణువులన్నీ అంగారమై ఆవిరవుతున్నాయి!
అనుకుంటూ ఇలాగే బతికెయ్యమంటావా?

నిమిషానికి అరవై గుండుసూదులు గుండెల్లో దిగుతున్నా....  
నువ్వెప్పుడూ నాకు గగన కుసుమమేనా? 
దూరమంతా దగ్గరవ్వాలంటే నిన్నెక్కడ వెతకాలి?
నీళ్ళూరిన కళ్ళలోనా? నిట్టూర్పు సెగలలోనా?
నీటికుండై పగిలే గుండెలోనా? లేవని నిలేసిన నిమిషాలలోనా?
                                                                                 --------------వంశీ

Monday, April 4, 2011

నేనొచ్చేశా....

ఇప్పుడే నరికి తెచ్చిన చెరుకుగడలతో
తొట్టతొలి పూతలేసిన కొత్త వేపగుత్తులతో
ఆ పల్లెతోపుల్లో విరగ్గాసిన లేపులుపు మావిళ్ళతో
ఒళ్ళంతా పొగరు నిండిన వగరు బింకాలతో
చప్పటి బతుకును నింప ఉప్పు కారాలతో
నేనొచ్చేశా....
లేతచివుళ్ళు తిని గొంతు సవరించుకున్న కోయిలనై
మరో ఛైత్ర శుద్ధపాడ్యమినై
తెలుగింటి గడపలకు పసుపుపూతనై, శుభతోరణాన్నై,
ఆమని మోసుకొచ్చిన పులకరింతనై
వాకిళ్ళ  చన్నీటి కళాపి చిలకరింతనై 
ముంగిళ్ళ రాలుపూత ముగ్గునై 
సిరులొసగు 'శ్రీఖరాన్నై' ! 
                                                                        ------------------ వంశీ   

Saturday, March 26, 2011

వేంకటరాయని కీర్తించే నా ప్రయత్నం

పల్లవి: ఇరులు మూగ మరులుగొనగ అలమేలుమంగ
మాటున దాగక వాటపు తెఱగుల రాడేల శ్రీధరుడు ||ఇరులు||

చరణం 1: చిత్తరువై ఎదుట కులుకులుమీర నిలువగ 
ఉల్లము ధల్లున పొంగిన అనఘ అలమేలు
ముత్తెపు నగవులు ముచ్చట గొలుపగ
చిత్తమునలరించ అరుదెంచడేల శ్రీవిభుడు ||ఇరులు||

చరణం 2: గ్రీష్మయామిని చల్లిన చంద్రికలేరగ
ఆ పరి ఈ పరి ఒనరిన జవరాలు అలమేలు
క్రీగంటి చూపుల చురుకంట తన ఎదనేలగ 
సిరిమోవి మెరుపంట రాడేల మేటి తిరువాడలవాడు
అమరాద్రి కొలువైన అన్నమయనుత శ్రీవేంకటరాయడు ||ఇరులు||
                                                                                --------------- వంశీ

Sunday, March 20, 2011

బతుకుబొమ్మ

గుప్పెడు నవ్వులు-గుక్కెడు కన్నీళ్ళు,
ఉసురు పోసుకుని ఊపిరొదిలే
చక్రగమనంలో మనకి మిగిలే ఆనవాళ్ళు!
అవే బతుకుబొమ్మను గీసే రంగుల కుంచెలు,
కొన్నిసార్లు అందంగా.....కొన్నిసార్లు వికారంగా!
కొన్నిసార్లు అలవాటుగా.....కొన్నిసార్లు తడబాటుగా!
                                                                   --------------- వంశీ

జాగృతి

మబ్బుపట్టిన నా జాతి జాగృతికి
శమనపాశాలు వదిలించి
సంకుచత్వాన్ని సడలించే రుద్రవీణ మోగించేదెవ్వడు?
ఏలికల విషక్రీడలపై అగ్నిధార కురిపించేదెవ్వడు?
బతుకున వెలుగురేఖలు నింప మరో తూర్పై పుట్టేదెవ్వడు?
నేను ఆంధ్రోడిని కాను, తెలంగాణోడినీ కాను
ఇచ్ఛగా పచ్చలు పూసే అక్షరాల మచ్చలు పడగా
బడుగులు గోడున కన్నీటిరాగం పాడగా
జనాభ్యుదయం చరమాంకమై, జనశ్రేయం శవమైపోగా
చేవలేక చేష్టలుడిగి చచ్చిన
తెలుగోడిని, అవును నేనొక తెలుగోడిని
                                                                    ---------------- వంశీ

Friday, March 11, 2011

మాకు వెరపెందుకు? సిగ్గెందుకు?

నువ్వు నేర్పిన భాషతో నిను వేనాల్కల తూలనాడతాం, మాకు వెరపెందుకు?
నడివీధుల్లో నీకు బట్టలూడదీస్తాం, మాకు సిగ్గెందుకు?
నువు మానవతివని తెలిసినా మా వికృతాలు మానం!
రొమ్ము కొరికి నెత్తురు పీలుస్తూనే వుంటాం! 
అదుగో నీ ఘనచరితం మా ముందు మట్టిబొమ్మై మోకరిల్లింది చూడు
నీ సౌభాగ్యం భాగ్యనగరంలో బలైంది చూడు   
ఉరకలేసే ఉన్మాదం మాది, రంకెలేసే రాక్షస రాజకీయం మాది
ప్రాంతీయ విద్వేషమే మా పరమావధి
మా గుండెలు బండరాళ్ళు, మా ఎదలు ఇరుకు గదులు
నిన్నిక ప్రేమించలేమని ఎంత మొత్తుకున్నా వినవే? 
నువు మాకు సరిలేని సిరివి గదమ్మా
నిన్ను ముక్కలు ముక్కలు చేసి పంచుకోనివ్వు!
మా కోసం నిన్ను బలిచ్చుకోనివ్వు!
నీ బిడ్డలమే కదమ్మా, భరిస్తావులే!  
మమ్మల్ని ఇలాగే క్షమిస్తావులే!
                                                            --------------- వంశీ 

Sunday, February 13, 2011

ఎందుకిలా ??

పంచప్రాణాలలో పంచదారలు చిలక,
పలుకుల పంచవన్నెల చిలక...

చేరలేని దూరాల్లో ఎగురుతోందా?
ఎప్పుడో కన్న రంగుల కలను, అలిమే కారుచీకటి మింగేసిందా?
ఇపుడే వస్తానని వెళ్ళిన వేకువ, ఆకాశతీరాల్లోనే విడిది చేసిందా?    
కళ్ళ కాలువల గుండా కావేరి కట్టలు తెంచుకున్నట్టు,
పొగిలి పొగిలి పొంగే ఈ నీటిముత్యాలు ఇక ఆగవా?  

ఒళ్ళంతా పల్లేరు ముళ్ళకంచెలా....
ఎప్పుడూ లేనిది ఎందుకిలా.....
దుఃఖపు సెగలలో ఆవిరవుతూ,
పదాలు భావప్రమిదలై కాలిపోతూ,
మాటలు గద్గద గమకమవుతూ,
అంతరంగం అవ్యక్తమవుతూ!!
                                                                         ----------------వంశీ

Saturday, February 5, 2011

ఎలా ??

అడుగుల్లో అడుగైపోయే నడకవేమో!
కళ్ళ వెంట నీరై జారే గుండెవేమో!
పెట్టని ముద్దులతో చెమ్మగిల్లే చెంపవేమో!
చూస్తేనే శిలగా మారే చూపువేమో!
మునిపంట పువ్వైపోయే నవ్వువేమో!    
రవితళుకువా? రాయంచవా? శశితునకవా? మణిచెణుకువా?
అలిగితే అల్లాడిపోనా, అడిగితే నన్నాపగలనా?
నాకు నేను మిగలని నువ్వైన నేను, నేను కాని నిన్నుతో, నేను నేనుగా 
నేనెప్పుడో నువ్వయ్యానని, ఎదురుతెన్నులు ఎన్నాళ్ళని,         
ఏమని చెప్పాలి? ఎన్నని చెప్పాలి? ఎలా చెప్పాలి?
                                                                           -------------వంశీ

Thursday, February 3, 2011

నీటివీణ

నీటివీణ మీటుతూ నీలిమబ్బు కరిగితే...
ఒళ్ళో వాలే చినుకు చిలకలు,
కురిసి కురిసి కన్నెవాగై ఉరికే...
వానగొంతులో జారే ఎన్ని పాటలు,
తడిమి తడిమి
లేత చివురులతో చెప్పే ఎన్ని మాటలు,
తడిసి తడిసి పూసే కొమ్మల్లో
పుట్టే ఎన్ని పులకలు,
ఎండుటాకై పలవరించే భూమి ఎడద మీద...
పచ్చికయ్యే పరవశానికే ఆ చిలిపి చిందులు!                                                                                -------------వంశీ