Wednesday, September 7, 2011

కన్నెవాన

పల్లవి:
                                             

వానా నువ్వెంత జాణవే,
గలగల పరుగుల
జిలిబిలి కులుకుల 
జలజల మోతల జలవీణవే!  |వానా|

అనుపల్లవి:

భూమిగుండెలో కరిగి
మండుటెండలో మరిగి
మింటిదారుల పెరిగే
మబ్బుకొమ్మల రాలుపూతవే |వానా|

చరణం:

మెరుపుచీర చుట్టుకుని
ఉరుముగజ్జె కట్టుకుని
మొయిలుగట్లు దాటుకుని
నీటిపూలు చల్లేవటే
పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే  |వానా|

అనుచరణం:

గగనపు నీళ్ళ జల్లెడ వెంట
వెండి నీరెండ నిండ
విల్లై విరిసిన ఏడురంగుల పంట
నీ మాయ కాదటే  |వానా|

చరణం:

మా ఇంటిచూరు నీటితీగవే
ఏటిపాయల తేట నురగవే
కొండవాగు కొత్తనడకవే
బండరాళ్ళకూ ఎండుటాకుకూ
కొత్తపూలకూ లేతచిగురుకూ
ముద్దులిచ్చి పొయేవటే        |వానా|

అనుచరణం:

ఆకుచెంపపై మెరిసి
సోకు వనమంతా తడిపి
వయసంతా వరదై వాగల్లే ఉరికేవటే
నింగినుంచి నేలకు దూరాలు కొలిచేవటే  |వానా|
                                                                  ---------- వంశీ

8 comments:

Anonymous said...

ఆకు చెంపపై మెరిసి, సోకు వనమంతా తడిపి... బావుంది వంశీ. రాస్తూండు.

వనజ తాతినేని/VanajaTatineni said...

very well

Anonymous said...

'జాణ' పదానికి అర్థం తెలుసు కదా! తెలిసీ పాపం వానను వదలిపెట్టాలనిపించలేదా?

వంశీ కృష్ణ said...

చదివి ఆనందించి అభినందించినందుకు అందరికీ కృతజ్ఞతలు

రసజ్ఞ said...

అందమయిన కవనం. అభినందనలు!

వంశీ కృష్ణ said...

thank you రసజ్ఞ gaaru..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగా రాశారు. అభినందనలు. గుబురుగా పెరిగిన పచ్చిక మధ్యలో ఉన్న వంశిని (పిల్లనగ్రోవిని) ఇప్పుడే చూశాను.

వంశీ కృష్ణ said...

థాంక్యూ మందాకిని గారు, ఈ పిల్లనగ్రోవి మీకు కనపడి వినపడినందుకు!

Post a Comment