Sunday, June 27, 2010

జనఘోష!

కోయిలక్కూడా కారుకూతలు నేర్పగల వదరుబోతులు!
కులమతాల కుంపట్లలో చలికాచుకునే కుహనాచరితులు!
అమ్మ రొమ్ము నెత్తురు పీల్చే రాకాసి మూకలు!
అన్నార్తుల కన్నీటి రుద్రభూమిలో పెరిగే విషపుచెట్లు!
ధనపురూకల దప్పి తప్ప ప్రజావ్యాకులమెరుగని అధినేతలు!
వీళ్ళా మన నవభారత నిర్మాతలు?...జనజీవన నిర్ణేతలు?
                                                                       -----------వంశీ

Thursday, June 24, 2010

ప్రేమఝరి

గుండె యవనికపై ప్రాణమై ప్రభవించి,
మనోభూమిపై ఉషాతుషారపు ప్రసూనమై వికసించి,
నిద్రాణమైన నా నిలువునా ప్రచోదనమై ప్రతిధ్వనించి,
విగతమైన నా ఉనికిని విరహమై కదిలించి,
వికలభావజ్వాలల దగ్ధమయ్యే నన్ను ముగ్ధచైతన్యమై ముట్టడించి,
కంటిపొరల చీకటి కుహరాల్లోకి ప్రభాతమై ప్రసరించి, 
నా విచారపు నీడలలో నవ్వుల ప్రకాశమై ప్రజ్వలించి,


వలపు తలపుల తలుపులు తట్టావు, తటిల్లతలా...
తనువణువణువూ మీటావు స్వరదీపికలా...


ప్రేమా! ఇక సాగిపోనీ నన్నిలా....
సాగరసంగమానికై గట్లు మరచి ఉరకలెత్తిన గోదారిలా...   
పరవశాలు తోడైన పరవళ్ళ పరువాల పరుగులా...
తొలకరికి మట్టిని ముద్దాడి మురిపించే వానజల్లులా...
పాలపొంగులా, నీలిమబ్బులా, 

వాగులా, వరదలా...'అలలా',
అలా అలా అలా!                                

                                                                --------వంశీ

Saturday, June 19, 2010

ఆక్రందన

మసిబారే మనిషి ఆలోచనల్లో నలిగి వసివాడిపోయావా?
రాగద్వేషాల మంటల్లో పొగచూరిపోయావా?
మతోన్మాదపు యుద్ధభూమిలో హత్యకు గురయ్యావా?
స్వార్ధం బలిదానం కోరితే త్యాగమనుకుని మోసపోయావా?
అభాగ్యుల కన్నీటి సముద్రాలలో మునిగిపోయావా?
బలయ్యే బతుకుల విలాపం వినలేక శిలగా శిథిలమయ్యావా?
విలువలకు చితులు పేర్చే స్మశానప్రపంచపు నీరవ నిశీథిలో,
నువ్వు ఇసుమంతైనా కానరాక....
కడ లేక నీతో కలిసి నడిచే ప్రేమతత్వానికి దిక్కుతోచక...
ఇక వెతకలేక అడిగిందా....
మానవత్వమా! ఎక్కడమ్మా నీ చిరునామా??                  
                                                            ----------- వంశీ
 

Friday, June 11, 2010

ఒక భావహారం

ఆకాశదేశపు రాజు కన్న పున్నమి గువ్వలు నేలను వాలితే, అది నెరవెన్నెల!
మనసొంపైన జోడు మల్లెలు మధుపర్కాలతో మంచాన్ని మనువాడి
ఈడు పూదోటకు పులకలు పుడితే, అది రాసలీల!
హాయి జామురేయి తెల్లవారి ఒళ్ళువిరిచి జావళీలు పాడితే, అది రవికిరణాల ఈల! 
భువిని విడిచి బాష్పజలమంతా  గగనవీధుల శ్రేణులుగా మెరిస్తే, అది మేఘమాల!
చివురులీనే మావికొమ్మలు గొంతు విప్పితే మధుమాసమే ఎలకోయిల!
గాలి వేణువులో చేరి గానమాడితే, అది రాగహేల!
ఇలా తీపి భావాలెన్నో తేనెలో తానమాడితే, అది తెలుగు మాటల ముత్యాల మాల!   
                                                                                                -- వంశీ

Monday, June 7, 2010

గెలుపు మజిలీ

ఎన్నో ఉలిదెబ్బలు తినాల్సిందే,
ఒక శిల శిల్పంగా మారాలంటే!
మట్టిని చీల్చుకు పుట్టాల్సిందే,
చిన్న విత్తైనా చెట్టై ఎదగాలంటే!
మెరిసే బంగారమైనా  కొలిమిలో కాలాల్సిందే,
తనకో రూపం పొందాలంటే!  
అందాలతో మురిసే మేఘమైనా కరగాల్సిందే,
వానై నేలకు దూకాలంటే!   
ఆగని కాలమైనా నడిరేయిని దాటాల్సిందే,
వెలిగే ఉదయపు వెలుతురు పిట్టై ఎగరాలంటే!
ఓరిమితో ఓటమి స్వారీ చేయాల్సిందే, గెలుపు మజిలీ చేరాలంటే!!   -- వంశీ

Wednesday, June 2, 2010

పల్లెఒడి

నిండు పున్నమి ఆరబోసిన పిండి వెన్నెల్లో,
ఆరుబయట అమ్మచేతి ఆవకాయన్నం...!!
ఇంటికి కూతవేటు దూరాన తుమ్మ కొమ్మకు వేలాడే గువ్వల గూడు...!!
పందిరంతా అల్లుకున్న మల్లె తీగ....!!
పంటచేను ఒంటిని తడిమే పైరగాలి....!!
రేగిపళ్లు కోసుకుంటూ...
రేగడి మట్టి ఫూసుకుంటూ...
రెల్లు గడ్డి పొదల్లో ఆడుకున్న దాగుడుమూతలు...!!
లేతపూతలతో నవ్వే మామిడితోపుల్లో వనభోజనాలు..!!
కాలమెరుగక వీధి అరుగు మీద చెప్పుకున్న కబుర్లు...!!
కాకెంగిళ్ళు పంచుకుంటూ తిరిగిన కాలవగట్లు...!! 

మొక్కజొన్న తోటల్లో కాల్చుకుతిన్న పాలకంకులు..!!
ఏటి గట్టున కట్టుకున్న గుజ్జనగూళ్ళు...!! 
మెరక పొలాన అరక దున్నే జోడెద్దుల గంగడోలు..!!
నేలమ్మకు చీరలు నేసే సిరిపచ్చని వరిచేలు...!!
రాములోరి పెళ్ళిలో తిన్న వడపప్పూ-పానకాలు...!!

నవరాత్రులప్పుడు మురిపెంగా విన్న హరికథలు..!! 
ఉగాది జాతరలో ఎక్కి ఆడిన ప్రభలు..!!
గుడిలో మొక్కిన దేవుని పాదాలు..!!

బడిలో తిన్న బలపాలు..!!
అపరభారతి సుబ్బులక్ష్మి సుప్రభాతాలు..!!
కమ్మని మీగడ పాలు, తియ్యని పుట్టతేనెలు, దొంగిలించిన దోరజామపళ్ళు  

ఆటలూ పాటలూ...ముగ్గుల వాకిళ్ళు...మురిపాలు పొంగే లోగిళ్ళు...
మరపురాని గుర్తులై ఎద గదిలో గంతులేస్తూ ...,
గుండె గోడకు కొత్త రంగులద్దుతుంటే...
వేకువ సూరీడు వెలుగు నవ్వులు రువ్వుతుంటే...
రాతిరేళకి చీకటి జడలో చంద్రుడు చుక్కల్ని మాలకడుతూ మురిసిపోతుంటే...
నా పల్లెతల్లి ఒడిలో పదే పదే ఒళ్ళు మరిచా..!!
                                                                                                                           ----- వంశీ