Friday, September 23, 2011

సరినెంచ సమయమురా రామా

సరినెంచ సమయమురా సారసనయన 
అగణితసుగుణ సాకేతరమణా రామా!  |సరినెంచ సమయమురా |

అంతట నువురా ఆద్యంతము నువురా  
అంతరంగమంతా ఆవరించినావురా        
చింతలుమాపి చిత్తశాంతముసేయరా
సంతససారంగమై గంతులాడజేయరా రామా! |సరినెంచ సమయమురా |

కరుణాశరములు సంధించరా
దరిజేర దారి చూపించరా
కరములు మోడిచి మనసార 
మరి మరి నిన్నే కొలుతునురా రామా!  |సరినెంచ సమయమురా |
                                                                                         ----------- వంశీ

Wednesday, September 7, 2011

కన్నెవాన

పల్లవి:
                                             

వానా నువ్వెంత జాణవే,
గలగల పరుగుల
జిలిబిలి కులుకుల 
జలజల మోతల జలవీణవే!  |వానా|

అనుపల్లవి:

భూమిగుండెలో కరిగి
మండుటెండలో మరిగి
మింటిదారుల పెరిగే
మబ్బుకొమ్మల రాలుపూతవే |వానా|

చరణం:

మెరుపుచీర చుట్టుకుని
ఉరుముగజ్జె కట్టుకుని
మొయిలుగట్లు దాటుకుని
నీటిపూలు చల్లేవటే
పచ్చిక పసరువై మట్టికి ఉసురిచ్చేవటే
పంటచేను ఒంటికి చినుకు లాల పోసేవటే  |వానా|

అనుచరణం:

గగనపు నీళ్ళ జల్లెడ వెంట
వెండి నీరెండ నిండ
విల్లై విరిసిన ఏడురంగుల పంట
నీ మాయ కాదటే  |వానా|

చరణం:

మా ఇంటిచూరు నీటితీగవే
ఏటిపాయల తేట నురగవే
కొండవాగు కొత్తనడకవే
బండరాళ్ళకూ ఎండుటాకుకూ
కొత్తపూలకూ లేతచిగురుకూ
ముద్దులిచ్చి పొయేవటే        |వానా|

అనుచరణం:

ఆకుచెంపపై మెరిసి
సోకు వనమంతా తడిపి
వయసంతా వరదై వాగల్లే ఉరికేవటే
నింగినుంచి నేలకు దూరాలు కొలిచేవటే  |వానా|
                                                                  ---------- వంశీ

Sunday, September 4, 2011

స్వప్నశిల

ఒక కలవరం, వెనువెంట ఒక పరవశం
పదే పదే.......  
ఎందుకో తెలీదు....మునుపెన్నడూ లేదు!     
నింగిని నిలువున చీల్చే మెరుపులా  
కలలశిలలు ఒక రూపుదాల్చిన నిజంలా     
మబ్బుకొమ్మల చెట్టురాల్చిన చినుకుపువ్వులా
వేల వీణలు వేణువులు
కలగలిసి కురిసిన గమకపు వానలా
                                                            ------------ వంశీ