Saturday, November 20, 2010

దీపాల పండగ

నవ్వు దివ్వెల దివిటీలు పట్టుకుని,
వెండి వెలుగుల మువ్వలు కట్టుకుని,
అంతులేని కాంతుల మిరుమిట్లు నింపుకుని,
మెరుపుల జలపాతమై, వెలుతురు తరంగమై,
నింగిచుక్కలు తెగిపడే వాకిళ్ళ నిండుగా,
అమావాస్య చీకట్లు పున్నమి కళలై పండగా,
నరకుని పాపాల పని పట్టిన దీపాల పండగ!
అందరికీ మురిపాల కానుకలు పంచాలని కోరుకుంటూ......
                                                                           ---------------- వంశీ

నన్ను నేను కనుగొన్నా

అపుడెపుడో కలగన్నా,
ఆ మాటపెగలని మౌనమైనా రాచిలుక రాగమని,
నను తడిమే చూపులన్నీ తన కళ్ళకు పూసిన కలువపూలని,
తగిలే ఊపిరి గంధమైనా గానవిహంగమని,
ఎరుపెక్కిన తన చెక్కిలే కందిన చంద్రుడని,
ప్రణయవనమంతా నను తన జడలో దండగుచ్చే దారమని,
కలిసి వేసే అడుగులన్నీ వినువీధి విహారమని,
అంతలో, నిమిషాలు క్షణాలయ్యే కాలమెరుగని వింతలో,
ఇపుడిపుడే కనుగొన్నా,
నా కలలన్నీ నిదురలేచే నిజాలేనని,
ఈడు జరిపే దాడులన్నీ నీ జాడలేనని!
                                                        --------------వంశీ

Friday, September 24, 2010

అంతరంగధ్వానం

ఈ క్షణం, ఈ హృదయతీక్షణం, 
పడమట కెంజాయలు పులిమిన సందె కాంతిలో,
అలలు పరిచిన గగనపటలం!
అలరులు మత్తడి పోసే తీపి మత్తులో, 
చివురును మెత్తగ తాకే గాలి సంతకం!
తెమ్మెర చాటున ఊరేగే తుమ్మెద గొంతున స్వరసప్తకం!
ఉదయకిరణపు మువ్వలపై గువ్వలు కూసే వెలుగు రేఖల దీపశిఖ!
సజలమేఘసంచలిత ప్రభాస ప్రకాశ ప్రజ్వలిత విద్యుల్లత!
మదనమంజూష శతసహస్రకుసుమశరాఘాత సమన్విత!
సువర్ణరంజిత తేజోద్దీపిత నిరుపమాన సుశోభిత పారిజాత!
రత్నఖచిత ముకుళిత నవమోహన పద్మరూపిత!
                                                                          ------------వంశీ

Thursday, August 26, 2010

మధుమేఖల

చెంపలకు పెదవికొసల పదునంటగా పుట్టిన పులకలా?
ఓరగా కంటికొనలు గీటగా మైమరపులా?
నిదుర కాజేయగా, అవి చూపులా? విరి తూపులా?
తనివితీరగా తళుకులీనగా, అవి వగలా, పసిమి నగలా?
సిగ్గులు కాలి ముగ్గులేయగా, అవి నవ్వులా, పువ్వుల మెరుపు రువ్వలా?
కోరిన కోర్కెలు పండగా ఎదురైనవి కోటి పండగలా?
గుండెగుమ్మానికి నువ్వే మావాకుల మధుమేఖల,
చూసావా అక్కడ కొలువు తీరిన నీ దాఖలా?
                                                                                 ---------వంశీ

Monday, August 16, 2010

ఇదేనా మన స్వరాజ్యం?

జడలు విప్పి ఆడుతున్న అవినీతి జాడ్యం!
ఎటేపు చూసినా స్వార్ధమాడే కరాళ నృత్యం!
రాజకీయపు రక్కసి మూకల టెక్కులబడి బడలిన జన జీవనం!
ఇప్పుడీ రాజ్యం వీరభోజ్యం కాదు,
కులమతాల కుంపట్లలో ఆజ్యం,
వంచన పంచన నిత్యనివాసం,
అధికారపు కుట్రపురుగుల ఆలవాలం,
జనాలేమైనా డబ్బే పరమ సూత్రం,
అందుకే సంకెళ్ళు తెంచుకుని అరవై మూడేళ్ళయినా
స్వరాజ్యభారతి కళ్ళ మేఘాలు ఇంకా వర్షిస్తున్నాయ్!
ఆనాటి త్యాగనిరతులకు మనమిచ్చే నివాళి ఇదేనా?
ఇకనైనా సిగ్గుపడదామా? 
జనజాగృతికి మనవంతు ప్రయత్నం చేద్దామా?
తల్లి భూమిపై ప్రేమను కొంతైనా చాటుకుందామా? 
                                                                     --------వంశీ 

గాంధర్వం

స్వరములే రాగ లహరులైతే, పాటలే ప్రాణవాయువులు!
పులకించే భాష భావగీతమైతే, మాటలే మౌనశరములు!
గాలి శ్వాసలో గానమై చెలరేగి కళలొలికింది,
గొంతులో పంచదార ధారలు చిలికింది,
రాళ్ళను నీళ్ళుగ మార్చే సామవేద గాంధర్వం!
ప్రాణమంతా ప్రణవమై పల్లవించింది,
మధురసాల మదివనాల నవకవనం, నా కవనం!
                                                                        --------వంశీ

Tuesday, August 10, 2010

విరహసరం

విరహం మరిగే వేసవిలో వేసారుతుంటే, 
శిశిరమై చల్లని ఋతురాగం వినిపించలేవా?
పదమంజీరాలతో వీనుల కోటి వీణలు మీటలేవా?
రాతిరి రారాజుతో ఆశల వెన్నెల కురిపించలేవా?
పంచప్రాణాలలో ప్రణయనాదం మోగేదాకా.....
ఉప్పొంగే పరవశం భావసముద్రమై పోటెత్తేదాకా.....
వలపు ఉప్పెనలో తడిసిన గుండె ప్రేమవేదం పలికేదాకా!!
                                                                             ---------- వంశీ

Monday, August 9, 2010

విన్నపం

నీ ఊపిరి గాలులు మోసుకొచ్చిన ఊహలు,  
మణికూజితాలై ముద్దుల మధుపత్రం రాసిపోనీ!
చురుకంటే ఆ సూదంటు చూపులు,
చురకత్తులై నా ఎద కోసిపోనీ!
ఆ పాలనిగ్గుల బుగ్గల మొగ్గలు విచ్చిన
సిగ్గుపూలను నన్ను కోసుకోనీ!
నీ బిగి కౌగిలి నెగళ్ళలో నన్ను చలి కాచుకోనీ!  
ఆ జారుపైటల మత్తుగాలి మెత్తగా నను తాకిపోనీ! 
సొత్తులకు చిత్తరువై నిను గుత్తంగా హత్తుకోనీ! 
నీ అధరపు నెత్తావుల జిత్తులలో చిత్తు కానీ! 
నీ పొత్తిళ్లలో మళ్లీ మళ్లీ కొత్తగా నను మొలకెత్తనీ!!   
                                                                     ---------వంశీ

Tuesday, August 3, 2010

ప్రేమంటే??

నా నవనాడుల వీణపై
నువ్వు శ్రుతించే రాగమేనా ప్రేమంటే?
నా ఎద గదుల్లో
నువ్వు రక్తమై ప్రవహించడమేనా ప్రేమంటే?
నా కళ్ళ వాకిళ్ళని 
నువ్వు కలల వరదై ముంచెత్తడమేనా ప్రేమంటే?
నీ ఉనికి తెలిసి
ప్రాణమంతా ఊపిరులూదుకోవడమేనా ప్రేమంటే?
నువ్వు లేక విరహపు ఎండలో
నేను కన్నీళ్ళతో దాహం తీర్చుకోవడమేనా ప్రేమంటే?
గుండె బీడుపై కురిసిన పులకల తొలకరికి, 
వయసు నీరెండలో మెరిసి వానవిల్లై, 
వలపు మొక్కలు నాటే ఏడు రంగుల బాణమేనా ప్రేమంటే?
ఇలా శతకోటి భావాలు అక్షరాలతో ఆడుకుని
కవితలుగా మారిపోవడమేనా ప్రేమంటే?
                                                                    --------వంశీ

Monday, July 26, 2010

హైందవ కళ్యాణం

కనుదోయి కలయికల మాటలన్నీ 'తొలిచూపులు' !
ఉల్లాసం ఉరకలేసే మంగళస్నానాల 'స్నాతకం'! 
శుభాలు పల్లవించే పరమేశ్వరి ఆశీస్సుల 'గౌరీపూజ'!
నవధాన్యాలతో వధూవరుల నవబంధానికి 'అంకురార్పణం'!
నుదుట బాసికం తారాడ, పారాణి పాదాల పారాడ,
పట్టుచేలములు పందిట్లో జీరాడ, గట్టి మేళము స్వరమంత్రము పాడ,
మానసద్వయమేకతాళమున మమేకమౌ 'సుముహూర్తం'!
సిరినగవు పొంగారే వరుడు, విరిచెంపల పాల్గారే వధువు
సిగ్గుబరువున వంగిన పసిడి మెడలో పసుపుతాడు!
ఈ ప్రాణబంధానికి క్షతములేదని దీవించు అక్షతల జల్లు!
పరవశంతో పరవళ్ళు తొక్కు తళ తళ తలంబ్రాలు!
అగ్నిఋజువుగా పాణిగ్రహణం, ఆపై బ్రహ్మముడితో మెట్టే 'సప్తపది'!
మెట్టెలతో 'సన్నికల్లు' తొక్కి, నల్లపూసలు కట్టే 'నాగవల్లి'!
కన్నవారు కన్నుల నీరిడ అమ్మాయి 'అంపకాలు'!
ఆ సందడితో డెందములలర సంతసమునకంతులేక భాసిల్లు
మన హైందవ కళ్యాణశోభ చూడతరమా! చెప్పతరమా!
                                                                       ------------వంశీ

Saturday, July 24, 2010

గుండె ఊసులు!

నీ సోకు సోకితే చాలు, వెనువెంటనే నా మనసుకి వేల మూర్ఛలు!
నీ పలుకులు తేట తెలుగు పాటల తేనె ఊటలు!
వలపు మావిచిగురుల వగరు వగలే నీకు నగలు!
వెండి వన్నెలే నా పాలిట వెన్నెల చినుకులు!
కలహంసకే కన్నుకుట్టే ఆ హొయల లయలు!

అక్షరాలు పదాలై, పదాలు కవన నదాలై ప్రవహిస్తున్నాయి, నీ మాయేనా?
నా నరనరాన కురిసిన ఈ స్వరాలవాన, నీ పాటలేనా?
అదుపెరుగని అనుభూతుల ఆవర్తనం, అది నువ్వేనా?
కనులెరుగని కలల సంవర్ధనం, నీ కళలేనా?
జన్మకంతా సరిపొయే సంతోషం పంచినది, నీ నవ్వేనా?
మరణమైనా వరమే అనుకుంటా, నీ సాంగత్యాన! 
                                                                     ------------వంశీ 

Friday, July 23, 2010

పూవింటి శరం!

పూవింటి శరమా! కోరుకోని వరమా!
నువ్వొచ్చావని, నను మెచ్చావని
గుండెతోటలో గుత్తులేసిన గులాబీల గుబాలింపు
గుర్తు తెలియని గుబులు రేపుతుంటే,
మనసు మరాళిగా నాట్యమాడుతుంటే,
వయసు మధూకమై కొత్త రెమ్మలేస్తుంటే,
పరువమంతా మరువంలా గాలిలో గంధమవుతుంటే,
మత్తురేగిన మందహాసం ముత్తెపు సరులవుతుంటే,
చూపులు మరీచిలా కాంతులు చిమ్ముతుంటే,
విరితావుల విరజాజుల వింజామరలు వీస్తుంటే,
మరుభూమిలో కూడా మరులు పండవా!
మోవి తాకిన చోటల్లా సిరులు నిండవా!
                                                    ----------వంశీ

Monday, July 19, 2010

స్వగతం

ఇంద్రచాపమై మబ్బుమగ్గం మీద ఏడురంగుల చీరలు నేస్తాను!
చీకటినై నా నింగి ఒంటికి చుక్కలద్దుకుంటాను!
ఉదయదీపమై పొగమంచు ధూపమేస్తాను!  
యేటి గులకరాళ్ళ మీద నీటిపరుగును నేను!
మండుటెండను నేను, అది మరిపించే మలయసమీరమూ నేనే!    
నదిని నేను, కలిసే కడలి నేను, అలుపు లేని అలను నేను! 
నేలను నేను, తను పరుచుకునే పచ్చిక పరుపును నేను!
నిప్పును, కొండను, బండను, అడవిని, అవనిని అన్నీ నేనే!  
విశ్వమంతా ఆవరించిన ఆయువు నేను! 

షట్వర్ణాల ఋతుప్రస్తారం నేను!  
గ్రహరాసినై దిగంతాలు దాటుతాను!
కోపాగ్నిలో రగిలితే విలయానికి నిలయమౌతాను,
భీకర ఘీంకారపు ప్రళయదుందుభినౌతాను!  
నెలపొడుపు నాకు ముక్కుపుడక! 
పూర్ణ చంద్రబింబం నాకు బుగ్గన చుక్క!
సూర్యతేజం నా నుదుట మెరిసే అరుణతిలకం!
ఇంకా తెలియలేదా? నేను, ఆకృతులెన్నో తెలియని ప్రకృతిని!
                                                                            -------------వంశీ 

Tuesday, July 6, 2010

మురిపించిన మోహం!

నీ కోపం నాపై కురిసే అగ్నిపూల వర్షం,
నిలువెల్లా తడిపి నన్ను ఆవిరి చేయకు!
నీ నవ్వులు దోసిలి పట్టి స్వాతివానలో కడగనివ్వు!
సొగసులు మువ్వ కట్టి నీ దారుల్లో సిరిమల్లెలు చల్లనివ్వు!
నీ అరచేత పండిన గోరింట ఎరుపులు,
చెక్కిళ్ళు కందిన ముద్దుల మెరుపులు,

నా గుర్తులేనని మురిసిపోనివ్వు! 
మోహం రేపే మోజులన్నీ సన్నజాజులైతే,
మునిమాపుల్లో ముసిరే నీ చూపులే ముద్దుల ముక్తావళి!
అలుపెరుగని మైథునంలో అనుక్షణం మనకు దీపావళి! 
                                                                             ---------వంశీ

Friday, July 2, 2010

నీరాజనం!

దేవుళ్ళను కన్నది అమ్మ!
నా పాలిట దేవత అమ్మ!
నా ప్రాణాల ప్రణవమంతా అమ్మ!
ఆమె సహనం సరిలేని మేరుపర్వతం!
ఆమె పంచే పాశం, తీర్చలేని ఆకాశమంత ఋణం!
ఆమెది గరిమల కని పెంచిన ఘన చరితం!
అమ్మ హృదయం వన్నె తరగని వైభవాల ప్రేమ సింహాసనం! 
అక్కడ అనుక్షణం అనురాగాలకు పట్టాభిషేకం!   
జన్మలంటూ ఉంటే జన్మ జన్మకూ మా అమ్మకే జన్మించాలని, ఒక చిన్న స్వార్థం!
ఆమెకు నీరాజనాలతో అంకితమిస్తున్నా ఈ మాటలపూల అక్షరమధుపం!   
                                                                                ------- వంశీ 

Sunday, June 27, 2010

జనఘోష!

కోయిలక్కూడా కారుకూతలు నేర్పగల వదరుబోతులు!
కులమతాల కుంపట్లలో చలికాచుకునే కుహనాచరితులు!
అమ్మ రొమ్ము నెత్తురు పీల్చే రాకాసి మూకలు!
అన్నార్తుల కన్నీటి రుద్రభూమిలో పెరిగే విషపుచెట్లు!
ధనపురూకల దప్పి తప్ప ప్రజావ్యాకులమెరుగని అధినేతలు!
వీళ్ళా మన నవభారత నిర్మాతలు?...జనజీవన నిర్ణేతలు?
                                                                       -----------వంశీ

Thursday, June 24, 2010

ప్రేమఝరి

గుండె యవనికపై ప్రాణమై ప్రభవించి,
మనోభూమిపై ఉషాతుషారపు ప్రసూనమై వికసించి,
నిద్రాణమైన నా నిలువునా ప్రచోదనమై ప్రతిధ్వనించి,
విగతమైన నా ఉనికిని విరహమై కదిలించి,
వికలభావజ్వాలల దగ్ధమయ్యే నన్ను ముగ్ధచైతన్యమై ముట్టడించి,
కంటిపొరల చీకటి కుహరాల్లోకి ప్రభాతమై ప్రసరించి, 
నా విచారపు నీడలలో నవ్వుల ప్రకాశమై ప్రజ్వలించి,


వలపు తలపుల తలుపులు తట్టావు, తటిల్లతలా...
తనువణువణువూ మీటావు స్వరదీపికలా...


ప్రేమా! ఇక సాగిపోనీ నన్నిలా....
సాగరసంగమానికై గట్లు మరచి ఉరకలెత్తిన గోదారిలా...   
పరవశాలు తోడైన పరవళ్ళ పరువాల పరుగులా...
తొలకరికి మట్టిని ముద్దాడి మురిపించే వానజల్లులా...
పాలపొంగులా, నీలిమబ్బులా, 

వాగులా, వరదలా...'అలలా',
అలా అలా అలా!                                

                                                                --------వంశీ

Saturday, June 19, 2010

ఆక్రందన

మసిబారే మనిషి ఆలోచనల్లో నలిగి వసివాడిపోయావా?
రాగద్వేషాల మంటల్లో పొగచూరిపోయావా?
మతోన్మాదపు యుద్ధభూమిలో హత్యకు గురయ్యావా?
స్వార్ధం బలిదానం కోరితే త్యాగమనుకుని మోసపోయావా?
అభాగ్యుల కన్నీటి సముద్రాలలో మునిగిపోయావా?
బలయ్యే బతుకుల విలాపం వినలేక శిలగా శిథిలమయ్యావా?
విలువలకు చితులు పేర్చే స్మశానప్రపంచపు నీరవ నిశీథిలో,
నువ్వు ఇసుమంతైనా కానరాక....
కడ లేక నీతో కలిసి నడిచే ప్రేమతత్వానికి దిక్కుతోచక...
ఇక వెతకలేక అడిగిందా....
మానవత్వమా! ఎక్కడమ్మా నీ చిరునామా??                  
                                                            ----------- వంశీ
 

Friday, June 11, 2010

ఒక భావహారం

ఆకాశదేశపు రాజు కన్న పున్నమి గువ్వలు నేలను వాలితే, అది నెరవెన్నెల!
మనసొంపైన జోడు మల్లెలు మధుపర్కాలతో మంచాన్ని మనువాడి
ఈడు పూదోటకు పులకలు పుడితే, అది రాసలీల!
హాయి జామురేయి తెల్లవారి ఒళ్ళువిరిచి జావళీలు పాడితే, అది రవికిరణాల ఈల! 
భువిని విడిచి బాష్పజలమంతా  గగనవీధుల శ్రేణులుగా మెరిస్తే, అది మేఘమాల!
చివురులీనే మావికొమ్మలు గొంతు విప్పితే మధుమాసమే ఎలకోయిల!
గాలి వేణువులో చేరి గానమాడితే, అది రాగహేల!
ఇలా తీపి భావాలెన్నో తేనెలో తానమాడితే, అది తెలుగు మాటల ముత్యాల మాల!   
                                                                                                -- వంశీ

Monday, June 7, 2010

గెలుపు మజిలీ

ఎన్నో ఉలిదెబ్బలు తినాల్సిందే,
ఒక శిల శిల్పంగా మారాలంటే!
మట్టిని చీల్చుకు పుట్టాల్సిందే,
చిన్న విత్తైనా చెట్టై ఎదగాలంటే!
మెరిసే బంగారమైనా  కొలిమిలో కాలాల్సిందే,
తనకో రూపం పొందాలంటే!  
అందాలతో మురిసే మేఘమైనా కరగాల్సిందే,
వానై నేలకు దూకాలంటే!   
ఆగని కాలమైనా నడిరేయిని దాటాల్సిందే,
వెలిగే ఉదయపు వెలుతురు పిట్టై ఎగరాలంటే!
ఓరిమితో ఓటమి స్వారీ చేయాల్సిందే, గెలుపు మజిలీ చేరాలంటే!!   -- వంశీ

Wednesday, June 2, 2010

పల్లెఒడి

నిండు పున్నమి ఆరబోసిన పిండి వెన్నెల్లో,
ఆరుబయట అమ్మచేతి ఆవకాయన్నం...!!
ఇంటికి కూతవేటు దూరాన తుమ్మ కొమ్మకు వేలాడే గువ్వల గూడు...!!
పందిరంతా అల్లుకున్న మల్లె తీగ....!!
పంటచేను ఒంటిని తడిమే పైరగాలి....!!
రేగిపళ్లు కోసుకుంటూ...
రేగడి మట్టి ఫూసుకుంటూ...
రెల్లు గడ్డి పొదల్లో ఆడుకున్న దాగుడుమూతలు...!!
లేతపూతలతో నవ్వే మామిడితోపుల్లో వనభోజనాలు..!!
కాలమెరుగక వీధి అరుగు మీద చెప్పుకున్న కబుర్లు...!!
కాకెంగిళ్ళు పంచుకుంటూ తిరిగిన కాలవగట్లు...!! 

మొక్కజొన్న తోటల్లో కాల్చుకుతిన్న పాలకంకులు..!!
ఏటి గట్టున కట్టుకున్న గుజ్జనగూళ్ళు...!! 
మెరక పొలాన అరక దున్నే జోడెద్దుల గంగడోలు..!!
నేలమ్మకు చీరలు నేసే సిరిపచ్చని వరిచేలు...!!
రాములోరి పెళ్ళిలో తిన్న వడపప్పూ-పానకాలు...!!

నవరాత్రులప్పుడు మురిపెంగా విన్న హరికథలు..!! 
ఉగాది జాతరలో ఎక్కి ఆడిన ప్రభలు..!!
గుడిలో మొక్కిన దేవుని పాదాలు..!!

బడిలో తిన్న బలపాలు..!!
అపరభారతి సుబ్బులక్ష్మి సుప్రభాతాలు..!!
కమ్మని మీగడ పాలు, తియ్యని పుట్టతేనెలు, దొంగిలించిన దోరజామపళ్ళు  

ఆటలూ పాటలూ...ముగ్గుల వాకిళ్ళు...మురిపాలు పొంగే లోగిళ్ళు...
మరపురాని గుర్తులై ఎద గదిలో గంతులేస్తూ ...,
గుండె గోడకు కొత్త రంగులద్దుతుంటే...
వేకువ సూరీడు వెలుగు నవ్వులు రువ్వుతుంటే...
రాతిరేళకి చీకటి జడలో చంద్రుడు చుక్కల్ని మాలకడుతూ మురిసిపోతుంటే...
నా పల్లెతల్లి ఒడిలో పదే పదే ఒళ్ళు మరిచా..!!
                                                                                                                           ----- వంశీ

Monday, May 31, 2010

తెలుగు వెలుగు

అది నన్నయ చేతి వెన్నల, వెన్నెల పూత!
మొల్ల సుధలు కురిసిన రామాయణ గాథ!
పోతన పోత పోసిన నవనీతపు భాగవత లీల!
అల్లసాని అల్లికల తుళ్లిన మల్లిక!
త్యాగరాయనుత రామ పంచరత్న గళరవళి!
శ్రీనాథుడు గ్రోలిన శృంగార 'నైషధం' !
విశ్వనాథుని విశ్వజనీన "వేయిపడగల" పగడపు మేడ!
శ్రీ శ్రీ కలవరించి, ఆ కల వరించి తన కలం జాలువార్చిన 'మహా ప్రస్థానం'!
గురజాడ జాడల అక్షరయజ్ఞపు హవిస్సు!
అది కవుల కావ్య కవనాల భావవృష్టిలో తడిసి, తరించి తరింపజేసిన భాష!
కమ్మగా మనసును కమ్మే అమ్మ భాష!
యాసల సువాసనలు పొదువుకున్న భాష!
మాటల మీగడ తరకలు చిమ్మే భాష!
జిగిబిగి అల్లికల జిలుగులీను భాష!
విన్న వీనుల తేనెలూరు భాష!
రాజసపు నీరాజనాలతో రాజిల్లిన భాష!
పలుకు పలుకున మధువులొలికి కులుకు తెలుగు భాష!
పద్యగద్య విరాజితమైన మన భాష వధ్యశిలపై విలపించకముందే,
పశ్చిమ డొంకల  పడి సంకరమై వంకరలు పోకముందే,
తెలుగు భాషాభివృద్ధికి మన వంతు తోడ్పడదాం!
అచ్చ తెనుగు నుడికారానికి గుడి కట్టి పూజిద్దాం!
పదహారణాల తెలుగు తల్లికి పదహారతులిద్దాం! పాదపూజ చేద్దాం! ----- వంశీ