Sunday, May 22, 2011

వేడుకోలు

తెగని ఆశల తెగులేల ఎదకింక
ఏలికవై కాలమెల్ల కావగ కుదురై నన్నిక |తెగని|  

పుడమెల్ల  పాలించు పావనుడా
ఈ పుట్టుక పండించు దారేది నువు గాక |తెగని|
రవ్వంత మతిలేదురా ఇసుమంత దయరాక  
సుగతుల ఒరవడి చూపను వేడేది నిను గాక |తెగని| 
నమ్మిక గన్న మేటి గరిమల దొరవిక 
తెలియని త్రోవల తోసేది ఎవరిక నువు గాక |తెగని|    
తరగని శోభలతూగు తిరుపురవాసుడా
దురాత్మను కడగను విధమేది నువు గాక  |తెగని| 
కొండలకోనేటి కోవెల నెలవా నీకిక 
అయిదు ప్రాణాలు ప్రణమిల్ల ఆదరువు నువు గాక |తెగని|  
                                                                                        --------------- వంశీ

Friday, May 13, 2011

తాళజాల - మరో కీర్తనా ప్రయత్నం

పల్లవి: తాళజాలను భవతాపమింకను
తావియ్యవయ్యా వెన్నుడా నీ దరిని |తాళజాల|

చరణం 1: కోర్కెల కత్తులు కోయగబట్టెను
మైలదేహమిది మాయల భ్రమసేను
మాయని దురితకూటమిని కుమిలేను 
దీపించవయ్యా దన్నుగ వెన్నుడా నీకిదె విన్నపము! |తాళజాల| 

చరణం 2: సంకటకొలిమిని కాలగ బట్టెను
పాపపు సంకెల చెరనే బట్టెను
భారపు బతుకును త్రుంచగలేను
సరినెన్నవయ్యా నన్ను వెన్నుడా నీకిదె విన్నపము! |తాళజాల| 
                                                                                           --------------- వంశీ

ప్రస్తుతి

నుదురూ నామాల వాడు, వెదురూ నాదాల వాడు
తలచు వారి ఎదలందు ఎల్లపుడు మెదలేటి వాడు!
తిరునగమూ మీది వాడు, మర్రాకూ తెప్పల వాడు
సింగారి సిరులదేవి శ్రీలు కురిసే లోకాల రేడు!
కొలనుదరి కొంటెగాడు, మన్నుతిన్న మాయగాడు
కొనగోటా కొండను ఎత్తే బంగారుకొండ వీడు!
పాముపడగ నీడలతోడు, పాల అలల నిదురించు వాడు
అడుగులతో అవనిని కొలిచే పూవరపు చూపుల వాడు!
నీలిమబ్బు రంగుల వాడు, నెమలికన్ను పింఛము వాడు
కాళింది మడుగున ఆడే వామనపు అడుగులవాడు!!
                                                                                     ----------------వంశీ