Thursday, June 21, 2012

నెయ్యపు తియ్యందనం

చిరు చిరు గురుతులన్నీ చిగురుపచ్చగా...
చిన్ని చిన్ని అల్లర్లన్నీ గోరువెచ్చగా...
మనసుతీరని ముచ్చట్లకు మరపు లేక...
పదిలంగా ఈ పదేళ్ళ నెయ్యం పదికాలాలుగా...
గుండెకూ గుండెకూ వంతెనలేసుకున్నాం
రాగద్వేషాలన్నీ వడబోసుకున్నాం
నవ్వురంగు పూలెన్నో బతుకుమీద చల్లుకున్నాం
ఇగిరిపోని స్నేహగంధాలన్నో పులుముకున్నాం
కాలం వాకిట ఇదిగో ఇలా నిలుచున్నాం!
(కాలేజ్ మిత్రులతో మైత్రీబంధానికి పదేళ్ళ వయసొచ్చిన సందర్భంగా)
                                                                              ---------వంశీ

Wednesday, June 13, 2012

మదనతూణీరం!

క్షణమో తీరు ప్రకృతికన్య పయనాన...
తన కనుగవ సారించి చూసెనా,
నేలమదిని మొలిచే వేల మదనతూణీరాలు!
పెదిమల సైగను పిలిచెనా,
చినుకులు గొంతెత్తిన మేఘమల్హారాలు!
చెంగు చెంగున పొంగులెత్తెనా,

చేతనాత్మక చేనులై గంగచెంగులు!
ఎండావానల చీరకుచ్చిళ్ళు కదిలెనా,
వర్ణరంజితాలై వ్యాపించు ఇంద్రచాపాలు!
పంటిపువ్వులై నవ్వు రాల్చెనా,
ఉషాశైలము కన్న తూరుపుశోభలు!
గగనపుతెరలపై సంజకుంచెలా పారాడెనా,
మూగప్రేమకు సంకేతాల్లా సాగరసమీరాలు!
శారదరాత్రుల పూర్ణిమై వాలెనా,
కలువల ముద్దులిడు చంద్రమయూఖాలు!                                    
                                         --------వంశీ