Saturday, July 16, 2011

రామయ్య ఏమయ్య నను గానవూ!

పల్లవి: రామయ్య ఏమయ్య నను గానవూ ||2||
భువితనయ హృదయాలయ, అపరిమిత ప్రేమాలయ, రామయ్య ఏమయ్య నను గానవూ!  


చరణం 1: అమితలావణ్యముల వనిత సీత నీ చెంత 
సందిట సౌమిత్రి మారుతి పరివారమంతా
మహిలో మనుజులు దివిజనులంతా 
అన్నిజీవులు నిను మోహించి మొక్క
తన్మయతెరల నను మరచినావా సాకేత రామయ్య ఏమయ్య నను గానవూ! 


చరణం 2: కలికల్లోలముల బహుకలల వలల
ఎన్ని మోహముల ముంచేవిలా   
మతిహీనుడనైతి మాయలు చాలవా 
నిర్మలచిత్తమీయ జాగింత తగవా    
కోరి కోరి కోటిదండములివె 
నిను కొలిచి కొనియాడ మనసాయె కోదండ రామయ్య ఏమయ్య నను గానవూ!   


చరణం 3: సరసీరుహాక్ష దయార్ద్రదక్షా  
వరసుధావర్ష నీ పదపంకజముల చేరలేని గడ్డిపువ్వునయ్య   
గోపయ్య త్యాగయ్య అన్నమయ నీ భావగానముసేయ 
ఘనుడవై ఘనభక్తుల బ్రోచినావటగద 
ఈ బడుగు బతుకునలుపు మాపర భార్గవ రామయ్య ఏమయ్య నను గానవూ!   
                                                                                        --------- వంశీ   

Tuesday, July 12, 2011

నీదే నా మనోవిశ్వ సంచారం

పల్లవి: తగు రాగరీతులు తెలియవు నాకు, నోరార నిను నుతింప
తగు తాళగతులు తెలియవు నాకు , ప్రియమార నిను పూజింప

చరణం 1: సామగానమట నేనెరుగను

స్వరప్రస్తారమట నేనెరుగను
తమకపు గమకధారల నిను తడపనెరుగను
సదా నిన్నెద నిలిపి కొలుచుట తప్ప

చరణం 2: జతులెన్నొ లయలెన్నొ నేనెరుగను
సరిగాత్ర శ్రుతులెన్నొ నేనెరుగను
మందస్మితానంద మువ్వంపు ముకుందా!
నువ్వే నా మనోధర్మ సంగీతం
నిఖిలాంతరంగ నీలంపు నీరజాక్షా!
నీదే నా మనోవిశ్వ సంచారం 
                                                                         ---------------వంశీ

Sunday, July 3, 2011

పిలుపే ఓ లాలిపాట

పిలుపే ఓ లాలిపాట
తలపే ఓ పూలతోట  
కలిపే ఆ కళ్ళలో ఖైదునై నేనుంటా
జన్మంతా...ఈ జన్మంతా   
దయరాదా కాసింత   || పిలుపే ||  

ముసినవ్వు విసిరి వెలిగిస్తావు ముఖదీపం
కొసచూపు ముసిరి కొరికేస్తావు నా ప్రాణం
పెదిమలనదిమిన సిగ్గువర్ణం, అది లేత సంధ్యారుణం!
ఎద నిండా నవనీతం, నాకందితే హిమతల్పం
వెతికి వెతికి వేసారలేను, వరమై వరించుమా || పిలుపే ||