Monday, July 7, 2014

ఓం నమః శివాయ!

శశిమయూఖశోభిత మందస్మిత చంద్రమౌళి,
నిగమసార చైతన్యద్వార లయాధార నిరాళి,
రేగిపోనీ అభంగ సుజ్ఞాన గంగాతరంగ స్వరాళి,
సాగిపోనీ ఢమరుక నాదానువర్తన నర్తనకేళి,
ధారుణి కావవయ్య నిరతము నిండు కరుణ పొరలి!
ఓ ఉమావల్లభా! ఓ నాగాభరణా! ఓ త్రినయనా!
జగమెల్ల జేజేలు నీకు, ప్రాణాల జోహార్లు నీకు
ఓం నమః శివాయ! ఓం నమః శివాయ!
                                                        ----వంశీ

నగవులు చూపర నందకధరా!

పల్లవి: నగవులు చూపర నందకధరా
నొగిలిన జగముల ఆరడితీర

1: ఇనచంద్రులదె వెలుగ నీ కనుదోయిగా
కనకకళలమరె మేనిజిగి తేజరిల్లగా
అనంతరూపుడవై అలరారు అనిశముగా
వినుతికెక్కితివి శ్రీ వేంకటేశ మూలగరిమగా ||నగవులు||

2: వరుసనేడుగిరులై వెలసిన వేలుపవురా
పరుసము నీవె మాకు సొమ్ములేటికిరా
అరమరికలు లేక అందరి చేకొందువురా
వరములు కొల్లగ చల్లగ సిరిమనోహరా ||నగవులు|| 

                                                                 ---వంశీ

ఊగరే ఊగరే!

ఊగరే ఊగరే ఉయ్యాలడోలలూగరె
జగత్కల్యాణ జానకిరాములు శృంగారసీమల సాగరె ||ఊగరే ఊగరే||

గోమున రజనీముఖి చలువసిరిచంద్రికలేరగ
తమకాలే పొడతెంచ తగునిదురలు తారాడగ
సమయమిది చెంతే మీకు సరిసేవ శమనముగ
విమలాత్ములకు బ్రహ్మాండాలే లాలి లాలి జోలలు పాడగ ||ఊగరే ఊగరే||

కాలపు కలలఊట కమకమ్మని ఊసులు రేపగ
కెలవులే పొలయంగ వినతజనుల నుతిసాగ
నలుగడల వేదాలన్నీ లాలించె అమరికగా
అలమటలే ఆర్చీ తీర్చి అలపుగొన్న గరిమలు మీరుగ ||ఊగరే ఊగరే||
                                                                                               -----వంశీ