Tuesday, January 26, 2016

స్తబ్ధత!



బాధా లేదు, భయమూ లేదు
మనోలోకంలో మౌనతాండవం!
ఆశా లేదు, నిరాశా లేదు
అంతరాత్మలో శాంతిశోకం!
కలా లేదు, నిజమూ లేదు
కంటివానలో కాలే హృదయం!
బంధం లేదు, భావం లేదు 
దేహమంతా శూన్యయంత్రం!
నవ్వూ లేదు, ఏడ్పూ లేదు
పంచప్రాణాల్లో నిశ్చల ప్రణయవిలయం!
కోరిక లేదు, కోపం లేదు
జీవనమే నిర్జీవకవనం! 
                                ------వంశీ 

Saturday, January 9, 2016

మన్మథ'నామ సంవత్సరం

ఆరు ఋతువుల ఆరంభానికి ఆద్యగీతం,
ఆరు రుచులు సంగమించిన జీవనసారం,
అవనికి ఆమని పోసిన ఛైత్రస్నానం,
కోకిలగుంపులు గొంతెత్తిన బృందగానం,
పంచమవేదం అనిపించే పంచాంగశ్రవణం,
మావిపూతముగ్గుల తెలుగిళ్ళు మనోహరం,
బతుకువనానికి వసంతఘోషల మరోవరం,
ఇదిగో పూవిలుకాని చెణుకుల 'ఉగాది'బాణం
ఈ 'మన్మథ'నామ సంవత్సరం!!
                                                          --------వంశీ

నవజన్మాలు

కళ్ళల్లో కలల గుర్రాలు, కళ్ళెం వేసేదెలా!
గుండెల్లో హాయిగంపలు, భారం మోసేదెలా!
ప్రాణంలో ప్రణయసెల, పరుగు ఆపేదెలా!
రెప్పల్లో ప్రతిరూపాలు, చూపులు సాగేదెలా!
మాటల్లో మంజీరాలు, మౌనం వేగేదెలా!
నిలువెల్లా పులకలచాలు, అలజడి ఆగేదెలా!
నవ్వుల్లో చుక్కలవాలు, వెలుగులు ఎదమూలల,
నడకల్లో నవజన్మాలు, అడుగులు సాగాలిలా!
                                                                   ------వంశీ

ఏమనుకోను

నాలో నన్ను వెతుకుతుంటే,
నువ్వే దొరుకుతుంటే, ఏమనుకోను!
జన్మలన్నీ నీ సొంతమయ్యే
మాయేదో జరుగుతుంటే, ఏమనుకోను!
అడగని వరములేవో, నీ అడుగులై
నను చేరుతుంటే, ఏమనుకోను!
నాకు నేనే పరిచయమయ్యే
వింతేదో జరుగుతుంటే, ఏమనుకోను!
ఊపిరంతా ఓపలేని ఎడారిగాలి, దూరంగా ఉంటే
ఎదంతా ఏడురంగుల నింగితునక, ఎదురుగా ఉంటే!
                                                                               -------వంశీ

అమ్మలకమ్మకు ఆత్మనివాళి

ఘుమ్మని స్వరముల కమ్మని రూపుల
చిమ్ముచు వరముల మమ్ములగాచే
అమ్మలకమ్మకు ఆత్మనివాళి!


చండముండ శుంభనిశుంభ
మహిశ దశానన మర్దనకేళి,
దశ-హర దశదిన దసరా
పర్వపు మనసే భక్తిమరాళి!


వీణాపుస్తకపాణీ జ్ఞానవర్షిణి
శ్రీహరి హృదయాస్థ సిరులవేణి
హిమాద్రి కొలువైన శివునిరాణీ శివాని
సర్వచేతనరూపిణీ శర్వాణీ విజయవర్ధిని
సకలనీరాజనం సాష్టాంగవందనం! 

                                                      -------వంశీ

ఇన్ని చక్కదనాలెక్కడివమ్మా

ఇన్ని చక్కదనాలెక్కడివమ్మా చక్కెరబొమ్మా
ఎన్ని మొక్కవోనివగలమ్మా శ్రీహరి సిరికొమ్మా


మోసిన ఊసుల చిత్తపు బరువున
మూసిన కనులకు తమకములంటెనా
వేసవి చంద్రికవానల ఒరుపున
నీ సిరిచెక్కిటి నునుపులు మెరిసెనా ||ఇన్ని||



నీ సరి లేరంచు తిరుమూర్తి దాపై
ముసిహాస ముత్యాలు వర్షించు ఆపై
కొసరుచు ప్రేమల కొలుపు కాపై
పసమీరు కళల పరమపావనుడు నీపై ||ఇన్ని||
                                                                       ------వంశీ

Saturday, February 7, 2015

పసినవ్వులు

ఏటి గులకరాళ్ళమీద నీటిపరుగు 
లేగనోటికంటిన పాలనురుగు
చుక్కలింటిదొర చేను వెన్నెలకాపు
తోటపూలకు కన్నుకుట్టు తేటతెలుపు 
తొలిపొద్దు నేల చల్లుతున్న రవిపూత  
గుడికోనేట మెరిసే వెలుగుజీరలు
నింగినీలిపటం కట్టిన ఏడుచీరలు
చినుకు చుంబించిన పసరుమొలక,         
అంతే స్వచ్ఛంగా...అంతే స్వేచ్ఛగా   
ఓ క్షణం పసిడి జిలుగుల ఆ పసిబోసినవ్వు 
మలినాలు పులుముకున్న మనసుని ఇట్టే కడిగేసింది,
ఈ క్షణాలు యుగాలైతే ఎంత బావుణ్ణు! 
                                                      ---వంశీ