Thursday, April 5, 2012

దిక్కిక నీవె చక్కని తండ్రీ!

దిక్కిక నీవని మొక్కేమురా
చుక్కలనవ్వేల మా చక్కని తండ్రీ   


ఎక్కుచు చాలా బతుకు నిచ్చెనల
నిక్కుచు నలసితె పైపక్కన జేరను 
దక్కుచు నీ దయ దేవుళ్ళరాజ  
సొక్కుచు మాకు సకలము నీ పూజ   |దిక్కిక నీవని మొక్కేమురా| 

చెక్కిన రాతలు మార్చే మహిమలు
నిక్కము నీవే చెప్పవు చేతలు
ఎక్కడివయ్యా మాతో ఆడే ఆటలు
లెక్కలెంచక కాచుము తప్పులు    |దిక్కిక నీవని మొక్కేమురా|  

చిక్కుచు లోకపు లంకెల బడలితె
చిక్కని ప్రేమల మమ్మక్కున జేరిచె
మిక్కిలి సుఖమిదె హరీ నీ సేవ 
తక్కినవేవీ తలపున రానీక    |దిక్కిక నీవని మొక్కేమురా|

తక్కువగాదు ఈ భక్తిసముద్రము 
చక్కెరలూరు చదివితె నీ పేరు

పెక్కగు దుఃఖము చప్పున బోవు   
మక్కువ తీరగ నిను మరి మరి చూడ  |దిక్కిక నీవని మొక్కేమురా|
                                                                                    ------------వంశీ