Sunday, February 13, 2011

ఎందుకిలా ??

పంచప్రాణాలలో పంచదారలు చిలక,
పలుకుల పంచవన్నెల చిలక...

చేరలేని దూరాల్లో ఎగురుతోందా?
ఎప్పుడో కన్న రంగుల కలను, అలిమే కారుచీకటి మింగేసిందా?
ఇపుడే వస్తానని వెళ్ళిన వేకువ, ఆకాశతీరాల్లోనే విడిది చేసిందా?    
కళ్ళ కాలువల గుండా కావేరి కట్టలు తెంచుకున్నట్టు,
పొగిలి పొగిలి పొంగే ఈ నీటిముత్యాలు ఇక ఆగవా?  

ఒళ్ళంతా పల్లేరు ముళ్ళకంచెలా....
ఎప్పుడూ లేనిది ఎందుకిలా.....
దుఃఖపు సెగలలో ఆవిరవుతూ,
పదాలు భావప్రమిదలై కాలిపోతూ,
మాటలు గద్గద గమకమవుతూ,
అంతరంగం అవ్యక్తమవుతూ!!
                                                                         ----------------వంశీ

Saturday, February 5, 2011

ఎలా ??

అడుగుల్లో అడుగైపోయే నడకవేమో!
కళ్ళ వెంట నీరై జారే గుండెవేమో!
పెట్టని ముద్దులతో చెమ్మగిల్లే చెంపవేమో!
చూస్తేనే శిలగా మారే చూపువేమో!
మునిపంట పువ్వైపోయే నవ్వువేమో!    
రవితళుకువా? రాయంచవా? శశితునకవా? మణిచెణుకువా?
అలిగితే అల్లాడిపోనా, అడిగితే నన్నాపగలనా?
నాకు నేను మిగలని నువ్వైన నేను, నేను కాని నిన్నుతో, నేను నేనుగా 
నేనెప్పుడో నువ్వయ్యానని, ఎదురుతెన్నులు ఎన్నాళ్ళని,         
ఏమని చెప్పాలి? ఎన్నని చెప్పాలి? ఎలా చెప్పాలి?
                                                                           -------------వంశీ

Thursday, February 3, 2011

నీటివీణ

నీటివీణ మీటుతూ నీలిమబ్బు కరిగితే...
ఒళ్ళో వాలే చినుకు చిలకలు,
కురిసి కురిసి కన్నెవాగై ఉరికే...
వానగొంతులో జారే ఎన్ని పాటలు,
తడిమి తడిమి
లేత చివురులతో చెప్పే ఎన్ని మాటలు,
తడిసి తడిసి పూసే కొమ్మల్లో
పుట్టే ఎన్ని పులకలు,
ఎండుటాకై పలవరించే భూమి ఎడద మీద...
పచ్చికయ్యే పరవశానికే ఆ చిలిపి చిందులు!                                                                                -------------వంశీ