Thursday, April 28, 2011

ఆర్తి

మాట వినిపించకుంటే, రూపు కనిపించకుంటే    
కళ్ళెందుకో కారుమబ్బులై కరుగుతున్నాయ్!
ప్రాణనాడులు స్పందించనంటున్నాయ్! 
గుండెబావుల నీళ్ళింకిపోతున్నాయ్,
తడిజాడ లేని ఎండమావులవుతున్నాయ్!  
ఒక్క క్షణం ఎడబాటైనా చాలు
ఎగశ్వాసతో ఎద అల్లాడిపోతుంది!
చినుకు తాకని నేలలా ఉనికి లేక నిస్తేజమవుతున్నా!
చేరువగా నీ అడుగుల అలికిడి అయ్యేదెప్పుడో!
ఈ వేడిఋతువు ఆవిరి ఆగేదెప్పుడో! 
విడివడని చూపులసంకెల పడేదెప్పుడో! 

నవ్వుల్లో చుక్కలు పొడిచేదెప్పుడో!
                                                                         --------------వంశీ


Thursday, April 21, 2011

మనసుపూలు

ఒంటరి పువ్వుపై తుంటరి తుమ్మెద వాలినట్టు...
జంటకనులపై ఎగిరే కలల ఝంకారాలు!
నాలో నన్ను నేను కొత్తగా వెతుక్కునేట్టు
నువ్ రాగానే నిలువెల్లా వేల వేకువల కాంతిపుంజాలు!
మాటలు చాలని మమతలు పోగేసుకుంటూ...
వలపై వచ్చి వయసుతోటలో మనసుపూలు కోసుకెళ్ళు!
అవి నీకే...నువ్ నాకే...!!
                                                                    -------------- వంశీ

Tuesday, April 12, 2011

ఒంటరి ఘడియలు

పులుముకున్న శ్రీగంధం కొంచెం గాలిలో కలిపావా,
ఊపిరి తీగలపై ఎడతెగని హాయిసన్నాయి!
తురుముకున్న పూలు విదిల్చి పుప్పొడి ఇటు చల్లావా,
తనువణువులన్నీ అంగారమై ఆవిరవుతున్నాయి!
అనుకుంటూ ఇలాగే బతికెయ్యమంటావా?

నిమిషానికి అరవై గుండుసూదులు గుండెల్లో దిగుతున్నా....  
నువ్వెప్పుడూ నాకు గగన కుసుమమేనా? 
దూరమంతా దగ్గరవ్వాలంటే నిన్నెక్కడ వెతకాలి?
నీళ్ళూరిన కళ్ళలోనా? నిట్టూర్పు సెగలలోనా?
నీటికుండై పగిలే గుండెలోనా? లేవని నిలేసిన నిమిషాలలోనా?
                                                                                 --------------వంశీ

Monday, April 4, 2011

నేనొచ్చేశా....

ఇప్పుడే నరికి తెచ్చిన చెరుకుగడలతో
తొట్టతొలి పూతలేసిన కొత్త వేపగుత్తులతో
ఆ పల్లెతోపుల్లో విరగ్గాసిన లేపులుపు మావిళ్ళతో
ఒళ్ళంతా పొగరు నిండిన వగరు బింకాలతో
చప్పటి బతుకును నింప ఉప్పు కారాలతో
నేనొచ్చేశా....
లేతచివుళ్ళు తిని గొంతు సవరించుకున్న కోయిలనై
మరో ఛైత్ర శుద్ధపాడ్యమినై
తెలుగింటి గడపలకు పసుపుపూతనై, శుభతోరణాన్నై,
ఆమని మోసుకొచ్చిన పులకరింతనై
వాకిళ్ళ  చన్నీటి కళాపి చిలకరింతనై 
ముంగిళ్ళ రాలుపూత ముగ్గునై 
సిరులొసగు 'శ్రీఖరాన్నై' ! 
                                                                        ------------------ వంశీ