Monday, December 26, 2011

సూర్యసుమం

తూరుపుచెంపలపై తన తొలిచుంబనం
పుట్టిన పులకరింత పేరే ఉదయమట!

పడమటి కౌగిట తనివితీరిన తన తాపం
అలసిన గగనవేదిక పేరే సాయంత్రమట!

వెలుతురుపువ్వుల నవ్వులు కురుస్తూ
దివిదీవుల దివ్యాశ్వాల చరిస్తూ
భువిదారుల కిరణతేజాలు పరుస్తూ
దిక్కులతో చిరంతనంగా రమిస్తూ......
                                                      -------------వంశీ

Sunday, December 18, 2011

నింగినిదుర

మెత్తగా మబ్బుకుచ్చుల ఉయ్యాల  
మత్తుగా రాతిరమ్మ గాలిజోల   
చనువుగా చందమామ
ను కావలించుకుని
అనువుగా చుక్కలదుప్పటి కప్పుకుని
ఉరుకున పగలు కాచి, అలసి ఆదమరచి
పడమరకు ఒత్తిగిలి, పడుకుంది ఆకాశం
తూర్పు పొద్దొచ్చి ముద్దిచ్చినా లేవనంటూ
తుళ్ళి తుళ్ళి రవికాంతులు గిల్లినా లేవనంటూ
                                                                    ---------వంశీ

Friday, December 16, 2011

బంగారుదివిటీ

ఏళ్ళు గడుస్తున్నా, ప్రాణశిలనై నడుస్తున్నా
పొందలేని వాటికై పరుగులు పెట్టలేక
పొందగలిగిన వాటిపై చిన్నచూపు పట్టలేక

పొందిన వాటిని పొందిగ్గా దాచుకోలేక
ఏకాంతహిమాన ఘనీభవించేదాకా
ఏళ్ళు గడుస్తున్నా, అలాగే నడుస్తున్నా
పాతకం పాతాళానికి నెట్టేస్తున్నా
వెక్కిరించే చూపులసుడిగాలి చుట్టేస్తున్నా
స్పష్టాస్పష్ట బంధాలు బంధనాలై బంధిస్తున్నా
ఊహలనార ఉరితాళ్ళు పేనుతున్నా 
ముసిరే కన్నీటిముంపు ముంచేస్తున్నా
ఏళ్ళు గడుస్తున్నా, కరగని మబ్బునై నడుస్తున్నా
నాకు నేను కనిపించే, అంతరంగాన్ని వెలిగించే
ఎదో అంతుచిక్కని బంగారుదివిటీ కోసం
బ్రతుక్కి నన్ను తాకట్టు పెట్టుకున్నా
స్వేచ్ఛగా కదల్లేక, వదల్లేక, విడిపించుకునే వీల్లేక
ఒకే పథాన, ఒకే విధాన
నన్ను వెతుక్కుంటూ
ఏళ్ళు గడుస్తున్నా, ఇంకా అలాగే నడుస్తున్నా!
                                                                       ----------వంశీ


Friday, December 9, 2011

ఉదయహృదయం

రాతిరంతా కురిసిన మంచుమాటున దాగి దాగి
శరత్కాలపు లేతఎండలో రెక్కలారిన గువ్వకూనా,
నీ గుండెనూరి గొంతుదారి
పాట ఒకటి పరుగులెత్త
స్పందన పొందిన ఉదయహృదయం,
శ్వాసకిపుడు సరిగమల స్నానం!

ఏరికోరి చెంతచేరి
గాలిగంతులు వంతపాడ
మాటై చిగురించదా ప్రతిమౌనం,
కువకువల రాగాన పుట్టదా మరో ప్రపంచం !!
                                                                 -----------వంశీ