Friday, December 16, 2011

బంగారుదివిటీ

ఏళ్ళు గడుస్తున్నా, ప్రాణశిలనై నడుస్తున్నా
పొందలేని వాటికై పరుగులు పెట్టలేక
పొందగలిగిన వాటిపై చిన్నచూపు పట్టలేక

పొందిన వాటిని పొందిగ్గా దాచుకోలేక
ఏకాంతహిమాన ఘనీభవించేదాకా
ఏళ్ళు గడుస్తున్నా, అలాగే నడుస్తున్నా
పాతకం పాతాళానికి నెట్టేస్తున్నా
వెక్కిరించే చూపులసుడిగాలి చుట్టేస్తున్నా
స్పష్టాస్పష్ట బంధాలు బంధనాలై బంధిస్తున్నా
ఊహలనార ఉరితాళ్ళు పేనుతున్నా 
ముసిరే కన్నీటిముంపు ముంచేస్తున్నా
ఏళ్ళు గడుస్తున్నా, కరగని మబ్బునై నడుస్తున్నా
నాకు నేను కనిపించే, అంతరంగాన్ని వెలిగించే
ఎదో అంతుచిక్కని బంగారుదివిటీ కోసం
బ్రతుక్కి నన్ను తాకట్టు పెట్టుకున్నా
స్వేచ్ఛగా కదల్లేక, వదల్లేక, విడిపించుకునే వీల్లేక
ఒకే పథాన, ఒకే విధాన
నన్ను వెతుక్కుంటూ
ఏళ్ళు గడుస్తున్నా, ఇంకా అలాగే నడుస్తున్నా!
                                                                       ----------వంశీ


2 comments:

రసజ్ఞ said...

ఏకాంతహిమాన ఘనీభవించేదాకా ముసిరే కన్నీటిముంపు ముంచేస్తున్నాకరగని మబ్బునై నడుస్తున్నా మీ భావుకతకి నా అభివందనం!

వంశీ కృష్ణ said...

మరోసారి మీకు ధన్యవాదాలు

Post a Comment