Friday, October 26, 2012

వందేహం తిరునాథం!

సప్తనగాధీశం సకలకళాకోశం వందేహం తిరునాథం!
నిరుపమానరూపం వరవర్షమేఘం వందేహం తిరునాథం!
బ్రహ్మానందదాయకం బ్రహ్మాండకోటినాయకం వందేహం తిరునాథం!
మాయాకలితమోహనం మధువిధుమందస్మితం వందేహం తిరునాథం!
నిరతతేజోవిరాజితం నిత్యకళ్యాణశోభితం వందేహం తిరునాథం!
సర్వసంకటభంజనం ఉర్వీహృదిపీఠాధిష్టితం వందేహం తిరునాథం!
భవతిమిరహరమయూఖం భారనీరదసమనీలదేహం వందేహం తిరునాథం!
పరమదయాళపరమపురుషం పరమాత్మక పరమపావనం వందేహం తిరునాథం!
కలికలుషనాశకరం గుణమాలిన్యప్రసాదకం వందేహం తిరునాథం!
పయోధిజప్రాణాధారం జలజాసనుతం విజయకరం వందేహం తిరునాథం!
విమలభావదర్పం విశాలవిశ్వవృత్తపాలం వందేహం తిరునాథం!
నిఖిలజగత్కారణం అఖిలఫలప్రదాయకం వందేహం తిరునాథం!
                                                                          ---------వంశీ

Thursday, June 21, 2012

నెయ్యపు తియ్యందనం

చిరు చిరు గురుతులన్నీ చిగురుపచ్చగా...
చిన్ని చిన్ని అల్లర్లన్నీ గోరువెచ్చగా...
మనసుతీరని ముచ్చట్లకు మరపు లేక...
పదిలంగా ఈ పదేళ్ళ నెయ్యం పదికాలాలుగా...
గుండెకూ గుండెకూ వంతెనలేసుకున్నాం
రాగద్వేషాలన్నీ వడబోసుకున్నాం
నవ్వురంగు పూలెన్నో బతుకుమీద చల్లుకున్నాం
ఇగిరిపోని స్నేహగంధాలన్నో పులుముకున్నాం
కాలం వాకిట ఇదిగో ఇలా నిలుచున్నాం!
(కాలేజ్ మిత్రులతో మైత్రీబంధానికి పదేళ్ళ వయసొచ్చిన సందర్భంగా)
                                                                              ---------వంశీ

Wednesday, June 13, 2012

మదనతూణీరం!

క్షణమో తీరు ప్రకృతికన్య పయనాన...
తన కనుగవ సారించి చూసెనా,
నేలమదిని మొలిచే వేల మదనతూణీరాలు!
పెదిమల సైగను పిలిచెనా,
చినుకులు గొంతెత్తిన మేఘమల్హారాలు!
చెంగు చెంగున పొంగులెత్తెనా,

చేతనాత్మక చేనులై గంగచెంగులు!
ఎండావానల చీరకుచ్చిళ్ళు కదిలెనా,
వర్ణరంజితాలై వ్యాపించు ఇంద్రచాపాలు!
పంటిపువ్వులై నవ్వు రాల్చెనా,
ఉషాశైలము కన్న తూరుపుశోభలు!
గగనపుతెరలపై సంజకుంచెలా పారాడెనా,
మూగప్రేమకు సంకేతాల్లా సాగరసమీరాలు!
శారదరాత్రుల పూర్ణిమై వాలెనా,
కలువల ముద్దులిడు చంద్రమయూఖాలు!                                    
                                         --------వంశీ



Thursday, May 31, 2012

నీకు నువ్వే

కలతలు కొన్ని, వెలుతులు కొన్ని
నవ్వులు కొన్ని, ఏడ్పులు కొన్ని
పంచిన నిన్నలన్నీ పాడుబడనీ
కదిలే గమ్యమైనా కదలిక సాగనీ
చిన్న చింతలేని బతుకెందుకని
వెనుదీయక నడచిపో మున్ముందుకని
చెల్లాచెదురైన గుండె తునకల్ని ప్రేమతో పేర్చుకుంటూ
నిన్నలు దాటి నలుపులు చిమ్మిన రాత్రుల్ని చీల్చుకుంటూ
ఉదయపుకొసల మీద వెలుతురు పిట్టల్ని వేటాడుకుంటూ
ఒంటరిగా ఓరిమి సముద్రాన ఓటమిని ముంచేసుకుంటూ
రాసుకునే విజయగీతానికి స్వరాలు కూర్చుకుంటూ
చిగురంత ఆశల చిట్టి ప్రపంచాల్ని పుట్టించుకుంటూ
నీకు నువ్వే...నీకు నువ్వే....నీకు నువ్వే!
                                                      -----------వంశీ


Friday, May 25, 2012

Chooda chinnadaanavinthe - Annamacharya keerthana

[url=http://www.divshare.com/download/17106514-bf4]DivShare File - Chooda chinnadaanavinthe.mp3[/url]

ఎందు వెదకెదరా నిన్నెందు వెదకెదరా!

వందనములివె చందురుముఖ నందకుమార
డెందమందున అందమలమిన సుందరాకార
ఎందు వెదకెదరా నిన్నెందు వెదకెదరా

సందుసందుల మోగు అందెల
విందులాయె రేపల్లె మనముల
సందళ్ళ మురళిని గోవుమందలగాతువట ఇందీవర
ఎందు వెదకెదరా నిన్నెందు వెదకెదరా  ||వందనములివె||

చిందులేయ కాళింది మడుగుల
కందువల మందహాసములా
గంధముల మరందవనముల తిరుగాడిన తిరుపురేంద్ర
ఎందు వెదకెదరా నిన్నెందు వెదకెదరా ||వందనములివె||
                                                                             ---------వంశీ

Sunday, May 13, 2012

మోమెత్తవేమమ్మ కనక కమలజా

మోమెత్తవేమమ్మ కనక కమలజా   
గోమున శ్రీవిభుగూడిన విరహవిరజా 
  
మీగడ జిలుగు మేను మెరుగు దేరెనా  
ఆగమకళల నిపుణుడొచ్చిన సమయాన
మగని గని వణుకు మోవిరసము తొణికెనా    
ఆ గగనమందిన పలవరింతలేమొ చెప్పగ  |మోమెత్తవేమమ్మ కనక కమలజ|

కాగిన వెన్నెల కావిళ్ళాయెనా
తాగిన తమకపు తేనెలుపొంగెనా
వీగిన బిడియపు కాగిలిలోన       
సాగిన సరసకథలేమొ చెప్పగ |మోమెత్తవేమమ్మ కనక కమలజ|

Thursday, April 5, 2012

దిక్కిక నీవె చక్కని తండ్రీ!

దిక్కిక నీవని మొక్కేమురా
చుక్కలనవ్వేల మా చక్కని తండ్రీ   


ఎక్కుచు చాలా బతుకు నిచ్చెనల
నిక్కుచు నలసితె పైపక్కన జేరను 
దక్కుచు నీ దయ దేవుళ్ళరాజ  
సొక్కుచు మాకు సకలము నీ పూజ   |దిక్కిక నీవని మొక్కేమురా| 

చెక్కిన రాతలు మార్చే మహిమలు
నిక్కము నీవే చెప్పవు చేతలు
ఎక్కడివయ్యా మాతో ఆడే ఆటలు
లెక్కలెంచక కాచుము తప్పులు    |దిక్కిక నీవని మొక్కేమురా|  

చిక్కుచు లోకపు లంకెల బడలితె
చిక్కని ప్రేమల మమ్మక్కున జేరిచె
మిక్కిలి సుఖమిదె హరీ నీ సేవ 
తక్కినవేవీ తలపున రానీక    |దిక్కిక నీవని మొక్కేమురా|

తక్కువగాదు ఈ భక్తిసముద్రము 
చక్కెరలూరు చదివితె నీ పేరు

పెక్కగు దుఃఖము చప్పున బోవు   
మక్కువ తీరగ నిను మరి మరి చూడ  |దిక్కిక నీవని మొక్కేమురా|
                                                                                    ------------వంశీ

Tuesday, March 27, 2012

నా సాంతం నీ సొంతం

పల్లవి:
తొలిసారి లోకం చూసే
వరమచ్చే దైవం నువ్వే
ప్రతిసారి రుణమే తీరే  
ప్రణమిల్లే పాదం నీదే
నాలోని ప్రాణం కన్నా నువ్వే మిన్న
నా శ్వాసకు రూపం నువ్వేనమ్మ
నా బ్రతుకు పాటల్లోన పదమే అయినా
భాషే అయినా నువ్వేనమ్మ || తొలిసారి లోకం చూసే ||

చరణం 1:
నా గుండెకే లయనిచ్చినా
నా గొంతుకే మాటిచ్చినా
నీ తనువునే పంచిచ్చినా  ప్రతిఫలం నువుకోరవే
బుడి అడుగునే నడిపించిన
తడి కన్నులే వెలిగించిన  
కోవెలై నువు కదలగా ప్రతి పూజలో పువ్వునై పోనా
నా జీవనాదంలోనా శ్రుతులే అయినా
స్వరమే అయినా నువ్వేనమ్మ || తొలిసారి లోకం చూసే ||

చరణం 2:
నీలో కరుణకు రాళ్ళే కరగవా
చూపే ఓర్పుకు భూమైనా మురిసేగా
చీకటి దారిలో చంద్రుని చూపుగా
నాలో కాంతివై  నడిపేది నువ్వేగా
కష్టాలే కాల్చినా కడదాకా సాగనా
నీ పిలుపు శతమానం అంటుంటే దీవెనగా
కీడైనా చేరునా నా ఆయువు తీరునా  
నీ పేరే మంత్రంగా ప్రతిరోజూ చదవంగ

నా ప్రేమ సంగీతం అమ్మా 
నా సాంతం నీ సొంతం అమ్మా || తొలిసారి లోకం చూసే ||
                                                                  -----------------వంశీ 

Tuesday, February 14, 2012

మనసు మనసులో!


గుర్తులంటే ఎదను గుచ్చే గుండుసూదులని తెలియలేదు!
కంటివాన కురుస్తున్నా గుండెమంటలారలేదు
కలతనిదుర కమ్ముతున్నా కలల బరువు తీరలేదు 
చావులేని ఆశలున్నా, మూగఊసులు మూగుతున్నా
మగతైన మరపుకు ఒక బ్రతుకు చాలదు! 
మనసులేని మనసుపై మనసుపడ్డ మనసు మనసులో లేదు!
                                                                      ------వంశీ