Saturday, March 26, 2011

వేంకటరాయని కీర్తించే నా ప్రయత్నం

పల్లవి: ఇరులు మూగ మరులుగొనగ అలమేలుమంగ
మాటున దాగక వాటపు తెఱగుల రాడేల శ్రీధరుడు ||ఇరులు||

చరణం 1: చిత్తరువై ఎదుట కులుకులుమీర నిలువగ 
ఉల్లము ధల్లున పొంగిన అనఘ అలమేలు
ముత్తెపు నగవులు ముచ్చట గొలుపగ
చిత్తమునలరించ అరుదెంచడేల శ్రీవిభుడు ||ఇరులు||

చరణం 2: గ్రీష్మయామిని చల్లిన చంద్రికలేరగ
ఆ పరి ఈ పరి ఒనరిన జవరాలు అలమేలు
క్రీగంటి చూపుల చురుకంట తన ఎదనేలగ 
సిరిమోవి మెరుపంట రాడేల మేటి తిరువాడలవాడు
అమరాద్రి కొలువైన అన్నమయనుత శ్రీవేంకటరాయడు ||ఇరులు||
                                                                                --------------- వంశీ

Sunday, March 20, 2011

బతుకుబొమ్మ

గుప్పెడు నవ్వులు-గుక్కెడు కన్నీళ్ళు,
ఉసురు పోసుకుని ఊపిరొదిలే
చక్రగమనంలో మనకి మిగిలే ఆనవాళ్ళు!
అవే బతుకుబొమ్మను గీసే రంగుల కుంచెలు,
కొన్నిసార్లు అందంగా.....కొన్నిసార్లు వికారంగా!
కొన్నిసార్లు అలవాటుగా.....కొన్నిసార్లు తడబాటుగా!
                                                                   --------------- వంశీ

జాగృతి

మబ్బుపట్టిన నా జాతి జాగృతికి
శమనపాశాలు వదిలించి
సంకుచత్వాన్ని సడలించే రుద్రవీణ మోగించేదెవ్వడు?
ఏలికల విషక్రీడలపై అగ్నిధార కురిపించేదెవ్వడు?
బతుకున వెలుగురేఖలు నింప మరో తూర్పై పుట్టేదెవ్వడు?
నేను ఆంధ్రోడిని కాను, తెలంగాణోడినీ కాను
ఇచ్ఛగా పచ్చలు పూసే అక్షరాల మచ్చలు పడగా
బడుగులు గోడున కన్నీటిరాగం పాడగా
జనాభ్యుదయం చరమాంకమై, జనశ్రేయం శవమైపోగా
చేవలేక చేష్టలుడిగి చచ్చిన
తెలుగోడిని, అవును నేనొక తెలుగోడిని
                                                                    ---------------- వంశీ

Friday, March 11, 2011

మాకు వెరపెందుకు? సిగ్గెందుకు?

నువ్వు నేర్పిన భాషతో నిను వేనాల్కల తూలనాడతాం, మాకు వెరపెందుకు?
నడివీధుల్లో నీకు బట్టలూడదీస్తాం, మాకు సిగ్గెందుకు?
నువు మానవతివని తెలిసినా మా వికృతాలు మానం!
రొమ్ము కొరికి నెత్తురు పీలుస్తూనే వుంటాం! 
అదుగో నీ ఘనచరితం మా ముందు మట్టిబొమ్మై మోకరిల్లింది చూడు
నీ సౌభాగ్యం భాగ్యనగరంలో బలైంది చూడు   
ఉరకలేసే ఉన్మాదం మాది, రంకెలేసే రాక్షస రాజకీయం మాది
ప్రాంతీయ విద్వేషమే మా పరమావధి
మా గుండెలు బండరాళ్ళు, మా ఎదలు ఇరుకు గదులు
నిన్నిక ప్రేమించలేమని ఎంత మొత్తుకున్నా వినవే? 
నువు మాకు సరిలేని సిరివి గదమ్మా
నిన్ను ముక్కలు ముక్కలు చేసి పంచుకోనివ్వు!
మా కోసం నిన్ను బలిచ్చుకోనివ్వు!
నీ బిడ్డలమే కదమ్మా, భరిస్తావులే!  
మమ్మల్ని ఇలాగే క్షమిస్తావులే!
                                                            --------------- వంశీ